ముంబై నవంబర్ 24: డ్రగ్స్‌కు బానిస అయిన దంపతులు వాటి కొనుగోలు కోసం తమ పిల్లలను అమ్ముకున్నారు. రెండేళ్ల కుమారుడితోపాటు నెల రోజుల కిందట జన్మించిన బిడ్డను విక్రయించారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. షబ్బీర్ ఖాన్, అతడి భార్య సానియా డ్రగ్స్‌కు అలవాటుపడ్డారు. డ్రగ్స్ కొనేందుకు తొలుత తమ రెండేళ్ల కుమారుడ్ని రూ.60,000కు అమ్ముకున్నారు.కాగా, నెల రోజుల కిందట పుట్టిన పసి పాపను కూడా ఆ దంపతులు అమ్మారు. డ్రగ్స్ కొనేందుకు షకీల్ మక్రానీ అనే వ్యక్తికి నవజాత శిశువును
రూ.14,000కు విక్రయించారు. అయితే షబ్బీర్ ఖాన్ సోదరి రుబీనాకు ఈ విషయం తెలిసింది. ఆగ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేశారు. షబ్బీర్ ఖాన్, అతడి భార్య సానియా ఖాన్‌తోపాటు పసి బిడ్డను కొనుగోలు చేసిన షకీల్ మక్రానీ, డ్రగ్స్ ఏజెంట్ ఉషా రాథోడ్‌ను అరెస్ట్ చేశారు. శుక్రవారం అంధేరీ ప్రాంతం నుంచి నెల రోజుల నవజాత
శిశువును స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్ల కుమారుడి ఆచూకీ, ఆ బాలుడ్ని కొన్న వారి కోసం ఆరా తీస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.