నేలకొరిగిన ఉద్యమ తార..* *•
గుమ్మడివెల్లి రేణుక ఎన్‌కౌంటర్ లో కన్నుమూత* *
• అలిపిరి లో సీఎం చంద్రబాబు పై దాడి ఘటనలో రేణుక పాత్ర* *•
కడవెండిలోనే జరగనున్న అంత్యక్రియలు..*
*ఉమ్మడి వరంగల్, వాయిస్ టుడే:*
A fallen movement star.

కడవెండి కన్నీరు మున్నీరైంది.. ఆ తలిదండ్రుల గుండె బరువెక్కింది.. సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఎంచుకున్న దారిలో మరో ఉద్యమ తార నేలకొరిగింది. రజాకార్లను తరిమికొట్టిన నేల పై ఉదయించిన ఉద్యమకెరటం గుమ్మడివెల్లి రేణుక అలియాస్ సరస్వతీ ఆదివారం చత్తీస్‌గడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ లో మృతి చెందింది. చత్తీస్‌గడ్ రాష్ట్రం బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులో సోమవారం ఉదయం రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ) గీడం, బీజాపూర్లోని బైరమ్‌గూడ పోలీస్ స్టేషన్ సరిహద్దు గ్రామాలైన నెల్లడ, అకేలి, బెల్నార్ ప్రాంతాల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరగగా గుమ్మడివెల్లి రేణుక అలియాస్ సరస్వతి అలియాస్ బాను అలియాస్ చైతు మృతి చెందినట్లుగా బస్తర్ ఐజీ సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన రేణుక 2004 లో నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లి ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్నారు. అలాగే సెంట్రల్ రీజినల్ బ్యూరో, ప్రెస్‌టీం ఇన్చార్జి, ఎడిటర్ ప్రభాత్ పత్రికలకు ఇన్చార్జిగా ఉన్నారు. రేణుక పై తెలంగాణలో 20 రూపాయల లక్షల రివార్డు, చత్తీస్‌గడ్‌లో 25 లక్షల రూ రివార్డు ఉండటం గమనార్హం. 21 ఏళ్లుగా ఉద్యమంలో పనిచేసిన రేణుక తెలంగాణలో జరిగిన కొన్ని కీలక ఆపరేషన్లలోనూ పాల్గొన్నారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై అలిపిరి ఘటనలో రేణుక ముద్దాయిగా ఉన్నారు. అరణ్యంలో గత 21 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో కొనసాగుతూ ఉద్యమంలో ఎన్నో కష్టాలను ఒడిదుడుకులు ఎదురైనా ఆమె వెనకడుగు వేయలేదు. సహచరులెందరో ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసినా.. ఆమె శ్వాస చివరి వరకు ఉద్యమబాటను విడవకుండా అరుణ తారగా మిగిలిపోయింది రేణుక. కడవెండిలోనే అంత్యక్రియలు.. *-రేణుక సోదరుడు* రేణుక భౌతికకాయాన్ని స్వగ్రామం కడవెండి కి తీసుకొస్తాం. వీలైతే మంగళవారం లేదా బుధవారం అంత్యక్రియలు పూర్తి చేస్తాం. రేణుక తిరుపతిలో ఉన్నప్పటి నుంచే మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితురాలయ్యారు. 2004 నుంచి కుటుంబానికి దూరమయ్యారు. మధ్యలో కొన్నాళ్ల వరకు ఉత్తరాలు రాశారు. కానీ నేరుగా ఎప్పుడు కలవలేదు. రేణుక ఉద్యమంలోకి వెళ్లడానికి కడవెండి ప్రాంత నేపథ్యం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. తాము ఇప్పుడు అల్వాల్ పరిధిలోని వెంకటాపురంలోని రామచంద్రయ్య కాలనీలో ఉంటున్నాం. అక్క ఎన్‌కౌంటర్ లో చనిపోయిందని తెలియగానే చత్తీస్‌గడ్‌కు వెళ్తున్నాం.. అక్కడి నుంచి కడవెండికి భౌతికకాయాన్ని తీసుకువస్తాం.