ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి
భువనేశ్వర్ డిసెంబర్ 1: ఒడిశాలోని కేంఘహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం బాలిజోడి వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, మరో 12 మంది తీవ్రగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి జీపు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.ప్రమాద సమయంలో జీపులో 20 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. కెంఝహార్ జిల్లాలోని ఘటగావ్‌లో ఉన్న మాతా తారిణి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని చెప్పారు. వారంతా గంజాం జిల్లాలోని పొడమరి గ్రామానికి చెందినవారని వెల్లడించారు. బాధితుల్లో పలువురు మాజీ రాజ్యసభ సభ్యుడు రేణుబాల ప్రధాన్ బంధువులు కూడా ఉన్నారని తెలిపారు. కాగా, దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటి తారణి దేవాలయం. ఇక్కడ పార్వతీ దేవిని పూజిస్తారు.