కొత్తగూడెం పోలీస్ శాఖలో విషాద ఛాయలు
భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 30 (వాయిస్ టుడే) ప్రమాదవశాత్తు కొత్తగూడెంకు చెందిన మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి చెందడంతో కొత్తగూడెం పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ పర్యటన నేపథ్యంలో శనివారం బందోబస్తుకు విధుల నిమిత్తం మహిళా హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి భద్రాచలం వెళ్ళింది. భద్రాచలంలో కురిసిన కుండపోత వానతో పట్టణమంతా జలమయమైంది. రామాలయం అన్నదాన సత్రం వద్ద విధినిర్వహణలో ఉన్న మహిళా హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి రోడ్డుపై వరదగా పారుతున్న నీటిని దాటే క్రమంలో ప్రవాహంలో కొట్టుకుపోయి. ప్రాణాలు కోల్పోయారు. కొద్దిదూరంలోని స్లూయిజ్ కాలువలో శ్రీదేవి మృతదేహం లభ్యం అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా కొద్ది సేపటి క్రితం వరకు అందరితో కలసి ఉన్న తమ సహచరురాలు, ప్రమాదవశాత్తు మృతి చెందడంతో పోలీసుశాఖలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ సహచరురాలు తమ కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోవడంతో సహచర మహిళా పోలీసులు శ్రీదేవి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలి భర్త కూడా పోలీసు శాఖలోనే పనిచేస్తున్నారు. ఈ ఘటనతో కొత్తగూడెం పోలీస్ శాఖలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా భారీ వర్షం కారణంగా మంత్రి కెటిఆర్ భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్నారు.