– స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్న జార్డి మోర్
విశాఖపట్నం: ఆస్ట్రేలియాకు చెందిన మహిళ జార్డి మోర్ జగద్గురు ఆదిశంకరాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తోంది. ఆదిశంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ భారతావనిలో పాదయాత్ర చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామివారి ఆశీస్సులు అందుకుంది. పాదయాత్ర వివరాలను స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములకు వివరించింది. ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ శంకర సిద్ధాంతాలను ప్రచారం చేయడమే తన యాత్ర లక్ష్యమని తెలిపింది. ఆదిశంకరుల బాటలోనే తాను కూడా కాలినడకన పాదయాత్ర చేపట్టినట్లు వివరించింది. పూరిలో ప్రారంభమైన పాదయాత్ర కేరళ రాష్ట్రంలోని కాలడి మీదుగా చార్ధామ్ వరకు కొనసాగుతుందని తెలిపింది. మొత్తం ఆరువేల కిలోమీటర్ల మేర తన పాదయాత్ర ఉంటుందని పేర్కొంది. ఆరు నెలల పాటు రోజుకి 50 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ ప్రాంరతానికి చెందిన జార్డి మోర్ వృత్తిరీత్యా యోగ టీచర్. యూకే, టాస్మానియా దేశాలలో పర్యటించిన ఈమె శంకరాచార్య అద్వైత సిద్ధాంతాలకు ఆకర్షితురాలై పాదయాత్రకు ఉపక్రమించింది. మూడు వారాల క్రితం జార్డి మోర్ పూరిలో పాదయాత్రను ప్రారంభించింది. తుపాను ప్రభావంతో 3 రోజులుగా విశాఖలోనే ఉండిపోయింది. వాతావరణం అనుకూలించడంతో గురువారం పాదయాత్రను తిరిగి ప్రారంభించింది



