28న ఎస్సారార్ కాలేజీలో వేలాది మంది బీజేపీ కార్యకర్తల సమ్మేళనం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక…
సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపు
కరీంనగర్
ఈనెల 28న ఎస్సారార్ కళాశాల మైదానంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేలాది మంది కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యే ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఒక్కో పోలింగ్ బూత్ నుండి 20 మంది కార్యకర్తలను ఆహ్వానిస్తున్నామని… పార్లమెంట్ వ్యాపంగా వేలాది మంది కార్యకర్తలు హాజరు కాబోతున్నారని తెలిపారు. ఈ సమ్మేళనానికి వచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఈరోజు సాయంత్రం కరీంనగర్ లోని అశోక్ నగర్ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద కరీంనగర్ టౌన్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. అమిత్ షా రాక సందర్భంగా కార్యకర్తల సమ్మేళనానికి చేయాల్సిన ఏర్పాట్లు, రవాణ, ఇతరత్రా సదుపాయాల కల్పనపై చర్చించారు.
అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ…‘‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయండి. నగరాన్ని కాషాయ మయం చేయండి. ఎక్కడికక్కడ అమిత్ షా కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి.’’అని కోరారు.
‘‘కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2 వేలకు పైగా పోలింగ్ బూత్ లు ఉన్నాయి. ఒక్కో బూత్ నుండి 20 మంది చొప్పున 40 వేల మంది క్రియాశీల కార్యకర్తలను ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తున్నాం. వారంతా సమ్మేళనానికి వచ్చే విధంగా రవాణా ఏర్పాట్లు చేయండి. భోజన, తాగునీటి సదుపాయాలకు ఇబ్బంది లేకుండా చూడాలి. అమిత్ షా వేలాది మంది కార్యకర్తలను ఉద్దేశించి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ప్రతి ఒక్కరూ 28న నిర్ణీత సమాయానికి సమ్మేళనానికి హాజరై విజయవంతం చేయాలి’’అని కోరారు.