తిరుమలలో వైభవంగా పుష్పాలు ఊరేగింపు
A magnificent procession of flowers in Tirumala
తిరుమల,
తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు శనివారం తిరుమలలో ఘనంగా జరిగింది.
తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పుష్పయాగానికి శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం జరిగిందని చెప్పారు. మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు. ఇందుకోసం 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తామని చెప్పారు. తమిళనాడు నుంచి ఐదు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి రెండు టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు.