జనం మధ్యకు సమ్మక్క
వరంగల్, జనవరి 29
A meeting among the people
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహాజాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవాలైన వనదేవతల కొలువుతో ములుగు జిల్లాలో ఉన్న అటవీప్రాంతం జనసంద్రమైంది. జనవరి 28 బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెపై కొలువుదీరడంతో జాతరకు అంకురార్పణ జరిగింది. భక్తుల జయజయధ్వానాలు, ఆదివాసీ వాయిద్యాల హోరు మధ్య మేడారం పులకించిపోయింది.మేడారం జాతర ప్రారంభానికి వారం ముందు నుంచే మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు.. జాతర మొదటిరోజు సారలమ్మ రాకను చూసి తరించేందుకు పిల్లాపాపలతో తరలివచ్చారు. కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో ఉదయం నుంచే పూజలు నిర్వహించారు… సాయంత్రం వేళ అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలను మొంటెలో (వెదురు బుట్ట) ఉంచి మేడారానికి తీసుకొచ్చారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రతువులో ‘వరం పట్టడం’ అనే భక్తి ప్రక్రియ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవాలి. సంతాన భాగ్యం కోసం, కోరిన కోర్కెలు నెరవేరేందుకు మహిళలు ఆలయ మెట్ల నుంచి సుమారు వంద మీటర్ల మేర భూమిపై మోకరిల్లుతారు.. అమ్మవారిని మోస్తున్న పూజారులు వారిపై నుంచి నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం భక్తులను పులకింపజేసింది. దారంతా కోళ్లను బలిస్తూ వనదేవతలకు స్వాగతం పలికారు. జంపన్నవాగుదాటుకుని మేడారం చేరుకుని…అప్పటికే సిద్ధంగా ఉన్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చారుసమ్మక్క భర్త పగిడిద్దరాజు గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పెళ్లికొడుకుగా ముస్తాబై కాలినడకన అడవి మార్గంలో మేడారానికి చేరుకున్నారు. జాతర మొదటి రోజు ఉదయానికే మేడారం చేరుకున్న పగిడిద్దరాజు…ఆలయం వద్ద సమ్మక్క రాకకోసం వేచి చూశారు. సాధారణంగా మొదటి రోజు సాయంత్రానికి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును ప్రతిష్టిస్తారు..కానీ ఈ ఏడాది అనుకోని కారణాలతో ఆలస్యంగా గద్దెలపైకి చేరారు. రాత్రి 12 దాటిన తర్వాత దేవాదాయ శాఖ అధికారులు విద్యుత్ దీపాలను నిలిపివేసి, అత్యంత రహస్యంగా క్రతువును పూర్తి చేశారు.జాతరలో అత్యంత ప్రధానమైన ఘట్టం సమ్మక్క అమ్మవారి ఆగమనం జనవరి 29 గురువారం జరగనుంది. సాయంత్రం 5 గంటల సమయంలో చిలకలగుట్టపై ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య ఆధ్వర్యంలో రహస్యంగా పూజలు నిర్వహించి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపరిచి తీసుకొస్తారు. అమ్మవారు గుట్ట దిగే సమయంలో జిల్లా ఎస్పీ ఏకే 47 తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతం పలుకడం, ఎదురుకోళ్ల మండపం వద్ద మేడారం ఆడబిడ్డలు అమ్మవారికి నీళ్లతో స్వాగతం పలకే దృశ్యాలు భక్తులను పూనకంలో ముంచెత్తుతాయి. గురువారం రాత్రికి సమ్మక్క కూడా గద్దెపై కొలువుతీరిన తర్వాత వనదేవతలను భారీగా భక్తులు దర్శించుకుంటారుమేడారం జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర .. గురువారం నాడు జిల్లావ్యాప్తంగా స్థానిక సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భక్తుల రక్షణ కోసం సుమారు 13 వేల మంది పోలీసులు, 40 వేల మంది వివిధ శాఖల సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. జాతర మొదటి రోజే ఆర్టీసీ ఏర్పాటు చేసిన 50 ఎకరాల ప్రయాణ ప్రాంగణం బస్సులతో నిండిపోగా, ప్రైవేటు వాహనాల కోసం కేటాయించిన 1,462 ఎకరాల పార్కింగ్ స్థలం కూడా సరిపోలేదు. ఇక సమ్మక్క తల్లి గద్దెపైకి రాకతో ఈ రద్దీ మరింత పెరుగుతుంది



