తెలంగాణలో కొత్త జగడం
హైదరాబాద్, డిసెంబర్ 22
మైనార్టీ సభ కేంద్రంగా తెలంగాణలో కొత్త జగడం రాజుకుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంగా తబ్లీగీ సభకు గ్రాండ్‌గా ప్లాన్ చేశారు ఆ సంస్థ ప్రతినిధులు. సభకు సర్కార్ నిధులు విడుదలను హిందూసంఘాలు, బీజేపీ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. మానవ సేవే మాధవ సేవ అనిచెప్పడమే సదస్సు ఉద్దేశమంటున్నారు తబ్లిగీ ప్రతినిధులు. అసలు నిధుల వివాదమేంటి? సభ ఉద్దేశమేంటి వివరాల్లోకి వెళ్తే..తబ్లీగీ జమాత్‌కి తెలంగాణ సర్కార్ నిధులు విడుదల చేయడంపై వివాదం రాజుకుంది. తబ్లిగీ సదస్పు కోసం తెలంగాణ ప్రభుత్వం 2, 45 , 93,847 రూపాయలు మంజూరు చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ జారీ చేసిన జీవో-ఆర్‌టీ-123 ఆదేశాల మేరకు అధికారులు వివిధ శాఖల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిధులు విడుదల చేశారు. ఈ నిధులు కేటాయింపు కేంద్రంగా ఇప్పుడు వివాదం కొనసాగుతుంది.తబ్లీగీ జమాత్‌కి నిధులు విడుదల చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి హిందూ సంఘాలు.. బీజేపీ శ్రేణులు. మత మార్పిడులకు పాల్పడే సంస్థకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడమేంటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సమావేశాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. సమావేశం రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నిధులు మంజూరు చేసిన సూత్రధారులు ఎవరో తేల్చాలని ట్వీట్ చేశారు బండి సంజయ్. తబ్లీగీ జమాత్‌కి సర్కార్ నిధులు మంజూరు చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు వీహెచ్పీ. సమావేశాన్ని అడ్డుకుంటామని ఛాలెంజ్ చేస్తున్నారు.



