కవితకు దక్కని ఊరట
హైదరాబాద్, ఏప్రిల్ 8
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ ను కొట్టేసింది. చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వాదనల సందర్భంగా ఈడీ ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది. ఆమె కుమారుడికి ఇప్పటికే 7 పరీక్షలు పూర్తయ్యాయని.. కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. ఆమె రాజకీయంగా పలుకుబడి గల వ్యక్తి అని.. మధ్యంతర బెయిల్ ఇస్తే సాక్ష్యాలు, ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే అప్రూవర్ గా మారిన కొందరిని ఆమె బెదిరించారని.. అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేయాలని ఈడీ కోరింది. ఈడీ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం మధ్యంతర బెయిల్ పిటిషన్ తోసిపుచ్చుతూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, ఢిల్లీ మద్యం కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది.మరోవైపు, కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. తాజాగా, మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో.. మంగళవారం ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మరోవైపు, కవిత సాధారణ బెయిల్ పిటిషన్ పై మాత్రం ఈ నెల 20న ఇరు వర్గాల వాదనలు వింటామని న్యాయస్థానం ఇదివరకే తెలిపింది. కాగా, కవితను మార్చి 15న హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేయగా.. 16న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. తొలిసారి 2 రోజులు, రెండోసారి 3 రోజులు.. కోర్టు అనుమతితో మొత్తం 10 రోజులు ఆమెను కస్టడీలోకి తీసుకున్న ఈడీ విచారించింది. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించడంతో మార్చి 26న కవితను తీహార్ జైలుకు తరలించారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఈ నెల 4న విచారణ జరగ్గా.. తీర్పు రిజర్వ్ చేసిన అనంతరం తాజాగా తీర్పు వెలువరించింది.
కవితకు దక్కని ఊరట
- Advertisement -
- Advertisement -