రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ఈ నెల 15 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టనున్నారు. ఆయా గ్రామాల్లో చెత్తాచెదారం, పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రత, పిచ్చిమొక్కల తొలగించనున్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకులను శుభ్రం చేయడం, సైడుకాల్వలు, రోడ్ల మరమ్మతులతో పాటు ప్లాస్టిక్ రహిత గ్రామాల రూపకల్పనకు కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో శానిటేషన్, క్లోరినేషన్, పన్ను వసూళ్లు, రాబోయే వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని, గ్రామాల్లో మొక్కల సంరక్షణ, పెంపకానికి ప్రాధాన్యం వంటి వాటిపై పంచాయతీల ప్రత్యేకాధికారులు దృష్టి సారించాలని సూచించింది.
వేసవి ముగిసే వరకు సెలవులు ఇవ్వొద్దు
వేసవి ముగిసే వరకు పంచాయతీల్లోని ప్రత్యేకాధికారులు, గ్రామ కార్యదర్శులు, సిబ్బంది, ఉపాధి హామీ ఉద్యోగులెవరికీ సెలవులు ఇవ్వవద్దని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రత్యేక కార్యక్రమం జరిగే రోజుల్లో సెలవులొచ్చినా పంచాయతీల అధ్యక్షులు, ఉద్యోగులు పనిచేయాల్సిందేనన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈ నెల 15న ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించాలన్నారు.



