హైదరాబాద్, అక్టోబరు 19, (వాయిస్ టుడే ): తెలంగాణలో ఎన్నికల ఫైట్ ఎవరి మధ్య అన్నది తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి జాతీయ పార్టీ సైడ్ అయిపోయినట్లేనన్న అభిప్రాయం అంతకంతకూ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఇప్పటికే బీజేపీలో ఉలుకుపలుకు లేదు. 119 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఉన్నారని చెబుతూ వస్తున్న కమలం పార్టీ నేతలు, ఇప్పటి వరకు ఒక్క నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఏంటో సొంత పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. అదిగో జాబితా, ఇదిగో జాబితా అంటున్నారే తప్పా క్లారిటీ మాత్రం రాష్ట్ర నాయకత్వం ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ అందరి కంటే ముందుగానే ప్రకటిస్తే, కాంగ్రెస్ 55 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మేనిఫెస్టోల విషయంలోను కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా ప్రకటించాయి.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటాపోటీ ఉండే అవకాశం ఉందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ అంశం జనాల్లోకి వెళ్లిపోయింది. ప్రజలు కూడా కమలం పార్టీ గురించి మాట్లాడటం తగ్గించేశారు. తెలంగాణ బిజెపిలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, కీలక నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని ఓటర్లు అంచనాకు వచ్చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ వ్యవహారాలను కట్టడి చేసే విధంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీని రేసులోకి తీసుకువెళ్లడంలోసక్సెస్ అయ్యారు. బిజెపిలో ఈ తరహా ఏకాభిప్రాయం కనిపించడం లేదు. అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి వలసలు కొనసాగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు రెట్టించిన ఉత్సాహంలో పని చేస్తున్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌లు కాంగ్రెస్‌లోకి రావడం, బీఆర్ఎస్ పార్టీకి మైనస్‌గా మారింది. తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతోనే నేతలు చేరుతున్నారన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం, 5వందలకే సిలిండర్, ప్రతి మహిళకు నగదు హామీలపై చర్చించుకుంటున్నారు. ఏకాభిప్రాయం ఉన్న 55 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి దూకుడు పెంచింది కాంగ్రెస్. ప్రచారంలోనూ హస్తం పార్టీ ఏ మాత్రం తగ్గడం లేదు. బీఆర్ఎస్, బీజేపీ దొందు దొందేనంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దీన్ని తిప్పికొట్టడంలో బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టడంలో విఫలం అయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్ నేతలు అంటున్నా, ప్రజలు మాత్రం నమ్మలేకపోతున్నారు. లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తారంటూ బండి సంజయ్ కామెంట్లు చేశారు. అయితే ఇప్పటి వరకు కవితను అరెస్ట్ చేయలేకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏదో ఉందని ఓటర్లు నమ్ముతున్నారు. తమ మేనిపెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. వాటికి కొన్ని ఉదాహరణలకు చూపుతున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను పిలిపించి ఎన్నికల ప్రచారంలో వేడి పెంచారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను చుట్టేస్తున్నారు. ప్రతి రోజు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ సైతం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు. బీజేపీ గురించి అవసరం అయితేనే మాట్లాడుతున్నారు తప్పా పెద్దగా విమర్శలు, ఆరోపణలు చేయడం లేదు.