తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానుందని..సమన్వయంతో అందరూ కష్టపడి పనిచేయాలని రాష్ట్ర నేతలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సూచలను చేశారు. బుధవారం రాత్రి తాజ్‌కృష్ణా హోటల్‌లోని రేవంత్ రెడ్డి,మాణిక్‌రావ్ ఠాక్రే, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు నాయకులతో కలిసి కేసీ వేణుగోపాల్ సమీక్ష చేశారు. అలాగే ఈ సమీక్షలో దామోదర రాజనర్సింహ, మధుయాస్కీ, సంపత్‌కుమార్, అంజన్‌కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమీక్షకు హాజరయ్యారు. రాత్రి 10 గంటల దాకా జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 16వ తేదిన నిర్వహించనున్న సీడబ్య్లూసీ సమావేశాన్ని.. 17వ తేదిన జరిగే బహిరంగ సభలపై కూడా కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. అలాగే సీడబ్య్లూసీ సమావేశానికి పార్టీ జాతీయ నేతలందరు హాజరవుతున్న తరుణంలో దీన్ని ప్రతిష్ఠా్త్మకంగా తీసుకోవాలని సూచనలు చేశారు.
ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సహా పలువురు నేతలు రానున్నారని.. వీళ్లు 16,17వ తేదీల్లో హైదరాబాద్‌లోనే ఉంటారని చెప్పారు. ఇదిలా ఉండగా.. సభ నిర్వహణకు పార్టీ నేతలతో ఆహార, రవాణా, సమన్వయ తదితర కమిటీలను ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే వీటికి నేతలు మధుయాస్కీ, మహేష్ గౌడ్ తదితరులు నాయకత్వం వహించాలని తెలిపారు. సభకు ప్రతి మండలం నుంచి కూడా జనాన్ని సమీకరించాలని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే.. ఏం చేయనుందో అనేదానిపై 5 హమీలపై గ్యారంటీ పత్రాన్ని బహిరంగ సభలో సోనియా గాంధీ విడుదల చేస్తారని పేర్కొన్నారు. అయితే ఈ గ్యారంటీ హామీలను, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని నాయకలందరు ఐక్యమత్యంతో పనిచేయాలని అప్పుడే విజయం సాధ్యమవుతుంది సూచించారు.
అలాగే సెప్టెంబర్ 18న పార్టీ జాతీయ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని అలాగే.. ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తారని.. వాటిని విజయవంతం చేయాలని అన్నారు. మరోవైపు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా తాజ్‌కృష్ణ హోటల్‌లో.. వేణుగోపాల్, రేవంత్ సహా తదితర నేతలతో చర్చలు జరిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటే వామపక్షాలకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈనెల 17న నిర్వహించనున్న బహిరంగ సభ కోసం మైదానం ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే హైదరాబాద్‌లో విస్తృతంగా పర్యటించారు. అయితే సభకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ ఇవ్వాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 2వ తేదీన కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు ఇచ్చింది. కానీ అదే రోజున బీజేపీ కార్యక్రమం ఉండటం వల్ల తమకు ఇవ్వరేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక చివరికి ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇక తుక్కుగూడలో సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారని.. అయితే ఎక్కడ నిర్వహంచాలేది గురువారం నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు పేర్కొన్నారు.