ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు,
పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
Actions by Congress leadership against MLC Theenmar Mallanna
హైదరాబాద్, మార్చి 1, (వాయిస్ టుడే)
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెండ్ చేశారు. పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 5న షాకోజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ సభలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను వివరణ కోరింది. షోకాజ్ నోటీసులపై తీన్మార్ మల్లన్న నుంచి ఎలాంటి స్పందన రాలేదు.ఫిబ్రవరి 12 వరకు గడువు ఇచ్చినా, దాదాపు నెల కావస్తున్న షోకాజ్ నోటీసులకు బదులివ్వలేదు. మరోవైపు ప్రభుత్వంపై, కాంగ్రెస్ అధిష్టానంపై, పార్టీలో ముఖ్య నేతలపై విమర్శల దాడిని పెంచడంతో షోకాజ్ నోటీసులపై స్పందించని కారణంగా తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించాం, మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కుల గణన సర్వే ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందన్నారు. పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టేది లేదని, మల్లన్న చేసిన వాఖ్యలు తప్పు అన్నారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, సొంత అభిప్రాయాలను పార్టీపై రుద్దితే ఫలితం అనుభవించక తప్పదన్నారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం తాపత్రయ పడుతుంటే తీన్మార్ మల్లన్న విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు