పార్టీలో మార్పుల దిశగా చర్యలు
Actions towards changes in the party
విజయవాడ, ఆగస్టు 20,
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. యాక్టివ్ గా లేని నేతలను పార్టీ పదవుల నుంచి తప్పించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా ఒకరిద్దరు గొంతు మినహా మిగిలిన వారంతా మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తామే అయినట్లు వ్యవహరించిన నేతలు కూడా ఓటమి చెందిన వెంటనే ఇలా నీరుగారి పోవడంతో పార్టీ శ్రేణులు డీలా పడుతున్నాయని గ్రహించారు. అందుకే ముందు జిల్లాల వారీగా నాయకత్వాలను మార్చాలని వైఎస్ జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయన తెప్పించుకుని కసరత్తు చేస్తున్నారు. కొత్త నాయకత్వానికి బాధ్యతలను అప్పగిస్తే జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. అంబటి రాంబాబు, కాకాణి గోవర్థన్ రెడ్డి వంటి వారు మినహా మిగిలిన నేతలు ఎవరూ బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను కూడా వైసీపీ నేతలు ఉపయోగించుకోలేకపోతున్నారని వైఎస్ జగన్ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థుల జాడ కూడా కనిపించడం లేదు… వైసీపీ ప్రభుత్వ హాయాంలో మంత్రులుగా చెలాయించిన వారు కూడా కనీసం ప్రభుత్వంపై విమర్శలకు దిగకపోవడాన్ని ఆయన అభ్యంతరం చెబుతున్నారు. అలాగే జిల్లా నేతల నిర్వాకం కారణంగానే అనేక మున్సిపాలిటీలు,కార్పొరేషన్లు చేజారిపోతున్నట్లు గ్రహించారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పార్టీని వీడుతున్నా కనీసం ఆపేందుకు కూడా వైసీపీ నేతలు ప్రయత్నించకపోవడాన్ని వైఎస్ జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. 2019 నుంచి 2024వరకూ యాక్టివ్ గా ఉండటంతో కొందరు నేతలను జిల్లా అధ్యక్షులుగా నియమించారు. ఇప్పుడు వారి స్థానంలో కొత్త వారికి అవకాశమిస్తే కొంత ఫ్యాన్ పార్టీ వాయిస్ బలంగా వినపడుతుందని ఆయన భావిస్తున్నారు. ముందు జిల్లా స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేసి తర్వాత నియోజకవర్గాలపైనే కూడా వైఎస్ జగన్ ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యక్రమాలు పూర్తిగా కనిపించడం లేదు. కేవలం తనను కలిసేందుకు మాత్రమే నేతలు వస్తున్నారు తప్పించి, జనాల్లోకి వెళ్లే ప్రయత్నం నేతలు చేయకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోలేకపోతున్నామని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. పట్టున్న ప్రాంతాల్లోనూ నేతలు నీరుగారి పోవడంపై ఆరా తీస్తున్నారు. కొందరు నేతలు వ్యాపారాలకు పరిమితమవ్వగా, మరికొందరు నేతలు ఇతర ప్రాంతాలకు వెళ్లి నియోజకవర్గాలకు దూరంగా ఉండటాన్ని కూడా వైఎస్ జగన్ గమనించి అందుకు అవసరమైన చర్యలను ప్రారంభించినట్లు తెలిసింది. త్వరలోనే పార్టీలో సమూల ప్రక్షాళన జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.