అదిలాబాద్, నవంబర్ 28, (వాయిస్ టుడే ): 2018 జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఆత్రం సక్కు విజయం సాధించగా.. పార్లమెంటు స్థానం పరిధిలోని మిగిలిన ఆరుస్థానాలతోపాటు మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ స్థానాల్లో బీఆర్ఎస్నే విజయఢంకా మోగించి తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. ఆ తరువాత 2019లో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. బీజేపీ తరపున పోటీచేసిన సోయం బాపురావు ఎంపీగా అనూహ్య విజయం సాధించారు. బీఆర్ఎస్ తరపున బరిలో దిగిన గోడం నగేశ్ ఓటమిపాలయ్యారు. ఫలితంగా ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పులకు నాందిపలికినట్లుగా మారింది.జిల్లాలో 2018 శాసన సభ ఎన్నికలు, 2019లో పార్లమెంటు ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు రాజకీయాల్లో మౌలిక మార్పు కనిపిస్తోంది. పైగా అప్పట్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా విజయం సాధించిన బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రాఠోడ్ బాపురావు, రేఖానాయక్, ఆత్రం సక్కుకు టిక్కెట్లు దక్కలేదు. దాంతో రేఖానాయక్, రాఠోడ్ బాపురావు కాంగ్రెస్ గూటికి చేరారు. అప్పట్లో కాంగ్రెస్ తరపున ఖానాపూర్ , నిర్మల్, ముథోల్ అభ్యర్థులుగా పోటీచేసిన రమేష్ రాఠోడ్ , మహేశ్వర్‌రెడ్డి, రామారావు పాటిల్ ఇప్పుడు అవే స్థానాల్లో బీజేపీ బరిలో నిలవడం మారిన రాజకీయాలకు సంకేతంగా నిలుస్తోంది.గత అసెంబ్లీ ఎన్నికల్లో ముథోల్ బీజేపీ తరపున పోటీచేసిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవికి ఆపార్టీ టిక్కెట్టు నిరాకరించడం అసమ్మతిని రగిల్చింది. ఆమె బాధతో కమలం పార్టీని వీడారు. ఇలా ఉమ్మడి జిల్లాలో అన్ని శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అసమ్మతి వెంటాడుతోంది. నాయకులు జెండాలు మార్చినట్లే.. అనుచరగణం వ్యక్తిగత ఆశలు పెంచుకోవడం రాజకీయపార్టీలకు తలనొప్పిగా మారుతోంది. ఫలితంగా నాయకులు సైతం అసమ్మతిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్పా.. జిల్లా సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదనే విమర్శలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. రాజకీయాలంటేనే ప్రజల్లోచులకన భావన ఏర్పడేలా చేస్తోందనే భావన కలుగుతోంది.ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం.. రాజకీయంగానే కాదు ప్రకృతి సంపదలైన సున్నపురాయి, మాంగనీసు, బొగ్గు నిక్షేపాలకు పెట్టింది పేరు. పంటల పరంగా పత్తి, సోయా సాగుతో ఖండాంతరఖ్యాతి గడించింది. బాసర సరస్వతీ మాత కొలువై ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క విశ్వవిద్యాలయానికి నోచుకోలేదు. రాంజీగోండ్, కుమురంభీం, ఇంద్రవెల్లి అమరత్వంతో పోరాటాలఖిల్లాగా రాజకీయ రణక్షేత్రంగా ప్రసిద్ధి పొందినప్పటికీ ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో పట్టించుకోక నిరాదరణకు గురైంది. ఉత్తర, దక్షిణ భారతాన్ని అనుసంధానించే వారధిగా నిలుస్తున్నప్పటికీ అభివృద్ధి చేయాలనే విషయంలో పాలకుల మనసులను కదిలించలేకపోతోందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో తిరిగి పాగావేసేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసింది. కాంగ్రెస్, బీజేపీలోని అసమ్మతిని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రజాక్షేత్రంలో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పదేళ్లలో జిల్లాకు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లేలా అధికార గులాబీ పార్టీ నేతలు ప్రచారంలో దూసుకెళుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీగా అధికారం కట్టబెట్టినప్పటికీ.. జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం ఇసుమంత లేదంటూ కాంగ్రెస్ ప్రజల దృష్టిని ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది.హిందుత్వంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేననే నినాదంతో బీజేపీ ప్రజల నాడి పట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాలతో గత ఎన్నికల్లో లాగా ఓటర్లు ఎవరికీ జైకొట్టే పరిస్థితి కనిపించడంలేదు. రాజకీయ మార్పుతోనే అభివృద్ధి మార్కు కనిపిస్తుందనే సంకేతం పంపించే సాధారణ జనం కొంతవరకు ప్రయత్నం చేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ.. సామాజికవర్గాలు, పథకాలు, తాయిలాలతో రాజకీయ పార్టీలు చేసే ఎత్తుగడల భయం వెంటాడుతూనే ఉంది. ఏమైనప్పటికీ ప్రజల్లో గత ఎన్నికల్లో కనిపించిన ఏకపక్ష ఆలోచన విధానం ఇప్పుడు కనిపించడంలేదు. ఏ పార్టీని ఆదర్శిస్తారనే అంశం ఎవరికీ అంతుపట్టడం లేదు.


