ఆదిత్య రిహార్స్ ల్స్ ప్రారంభం
శ్రీహరికోట, ఆగస్టు 30: సూర్యుడిపై పరిశోధనే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపడుతున్న తొలి మిషన్ ఆదిత్య ఎల్ – 1 ప్రయోగానికి అంతా సిద్ధం అవుతోంది. ప్రయోగానికి ఇంకో మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో అందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. లాంచ్ రిహార్సల్స్‌తో పాటు రాకెట్‌లో ఇంటర్నల్ చెక్స్ అన్ని పూర్తి అయినట్లుగా ఇస్రో ప్రకటించింది. దీనికి సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.సెప్టెంబరు 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్ – 1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ 57 రాకెట్ నింగిలోకి మోసుకొని వెళ్లనుంది. ఈ ఆదిత్య ఎల్ – 1 శాటిలైట్ ను భూమికి సూర్యుడికి మధ్య ఉన్న లాంగ్రేజ్ 1 పాయింట్ (ఎల్ – 1) వద్ద ఉంచి అక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధన చేయనున్నారు. ఎల్ – 1 పాయింట్ వద్ద ఆదిత్య శాటిలైట్ ను మోహరించడం ద్వారా నిరంతరాయంగా శాటిలైట్ సూర్యుడిపై పరిశోధన చేయనుంది. చంద్ర, సూర్య గ్రహణాల సమయంలో కూడా నిరంతరంగా సూర్యుడిపై పరిశోధనలు చేయడానికి వీలుపడుతుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లాంగ్రేజ్ పాయింట్ – 1 ఉంటుంది.