ఒకరు సీనియర్ పొలిటిషియన్, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేత. మరొకరు పాలిటిక్స్‌లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా పనిచేసిన నేత.
వీరిద్దరి మధ్య పోరు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తిగానే మారింది. అక్కడ అధికార, ప్రతిపక్షాలకు ఎవరి ఓటు బ్యాంక్ వారికుంటుంది. ఎవరి రాజకీయాలూ వారివే. హాట్ హాట్ గా రాజకీయాలు సాగుతున్న ఆ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇరు పార్టీలు బలంగా తలపడనున్న నేపథ్యంలో ఆయా పార్టీలకు ఉన్న ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? ప్రజలు ఏ పార్టీకి జై కొట్టనున్నారు.. ఇద్దరు రాజకీయ ఉద్దండుల మధ్య పోరు ఎలా ఉండనుంది. ఇంతకీ ఆ నియోజకవర్గ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి..?
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం.. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం. ఇక్కడ మొదటి నుండి టీడీపీ, వైసీపీ నువ్వా – నేనా అన్నట్లు ఉంటాయి. పోటీలో ఎవరు ఉన్నా పార్టీ ఓటు బ్యాంక్ మాత్రం ఏ పార్టీ ఓటు బ్యాంక్ ఆ పార్టీకి పదిలంగా ఉంటుంది. ఇక్కడ అధికార వైసీపీ నుండి సీనియర్ పొలిటీషియన్, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుండి ఈయన మూడోసారి ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో బలమైన నేత. 1999 లో ఎంపీగా ఎన్నికైన బొత్స, ఆ తరువాత 2004లో చీపురుపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటినుండి ఈ నియోజకవర్గాన్ని తనకు పెట్టనికోటగా మార్చుకున్నారు. బొత్స 2004లో ఇక్కడ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత నుండి తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటూ, తనకంటూ ఒక బలమైన సొంత ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకోగలిగారు.
ఇక ఇక్కడ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుండి మాజీ మంత్రి, మాజీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బరిలో దిగుతున్నారు. 1983 లో టీడీపీ నుండి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కిమిడి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఉనుకూరు, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుండి ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లా నుండి రాజకీయాలు నెరపిన కళా వెంకట్రావు తొలిసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి బొత్స సత్యనారాయణపై బరిలో దిగనున్నారు. ఇద్దరు రాజకీయ ఉద్దండులు పోటీకి దిగడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అయితే ఇక్కడ వైసీపీ నుండి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్‌పి ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను ఈ నియోజకవర్గం నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గ వైసీసీ ఇంచార్జ్‌గా చిన్న శ్రీను కొనసాగుతున్నారు. చిన్న శ్రీను ప్రధానంగా ఈ నియోజకవర్గం పైనే ఫోకస్ పెడుతుంటాడు.. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సర్వీస్ ఇస్తుంటాడు. నియోజక వర్గంలో ఏ కార్యకలాపాలు అయినా ఈయన ముందుండి నడిపిస్తాడు. చిన్న శ్రీను నియోజకవర్గంపై బాగా గ్రిప్ ఉన్న నేత. అలాగే ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా స్థానికుడు కావడం, గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి నేతల వరకు మంచి సంబంధాలు ఉండటం వైసీపీకి కలిసొస్తున్న మరో అంశం.. అలా స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన, జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ముగ్గురు నియోజకవర్గ క్యాడర్‌ను ఏకతాటిపై నడిపిస్తూ వైసీపీకి ఇక్కడ కంచుకోటగా మార్చారు..
రెండు లక్షల మంది ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో కాపు సామాజికవర్గానికి చెందిన వారు ఉంటారు. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములు ఈ సామాజికవర్గ ఓటర్లే నిర్దేశిస్తారు. అయితే ఇక్కడ నుండి పోటీ చేసే అభ్యర్థులు ఇరువురు కాపు సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో కులాల ప్రస్తావన అంతగా రాదనే చెప్పాలి. అంతేకాకుండా ఈ నియోజకవర్గం ఆవిర్భావం నుండి టీడీపీకి కంచుకోట. పటిష్టమైన ఓటు బ్యాంక్ కలిగిన పార్టీగా చెప్పుకోవచ్చు. 1994, 1999లో ఇక్కడ నుండి కుల బలం లేని కమ్మ సామాజికవర్గానికి చెందిన గద్దె బాబురావు గెలిచారు. అలాగే, 2004, 2009 లో బొత్స చేతిలో గద్దె బాబురావు స్వల్ప మెజారిటీతోనే ఓటమి పాలయ్యారు. అయితే 2004 తరువాత బొత్స చీపురుపల్లి నియోజకవర్గంలో తన హవా పెంచుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడుగా ఉండగా నియోజకవర్గంలో ఓ వైపు చిన్న శ్రీను, మరోవైపు బొత్స సతీమణి బొత్స ఝాన్సీ ఎంపిగా నియోజకవర్గానికి విస్తృత సేవలు అందించారు.. ఈ సేవలే వ్యక్తిగత ఓటు బ్యాంక్ కు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలోనే 2014 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతే కాంగ్రెస్ నుండి చీపురుపల్లి లో పోటీ చేసిన బొత్సకు సుమారు నలభై రెండు వేల పైచిలుకు ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. ఆ ఓట్లన్నీ కేవలం బొత్స చరిష్మా వల్ల పడ్డ ఓట్లే.
ఇలా బొత్స అప్పటి నుండి ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో తిరుగులేని నేతగానే ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి బొత్స, వైసీపీ నుండి బెల్లాన చంద్రశేఖర్, టీడీపీ నుండి కిమిడి మృణాళిని పోటీ చేయగా ట్రై యాంగిల్ ఫైట్‌లో టీడీపీ అభ్యర్థి మృణాళిని గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019లో బొత్స వైసీపీ నుండి పోటీ చేయగా కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున టీడీపీ నుండి పోటీ చేసి బొత్స చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో చీపురుపల్లికి చెందిన ఎంపి అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ కూడా కావడంతో వైసీపీ ఓట్లు చీలకపోవడంతో పాటు అంతా ఏకతాటిపై నడిచి ఎన్నికలు చేయడంతో బొత్స గెలుపు నల్లేరు మీద నడక అయ్యింది.. అయితే ఇప్పుడు మరోసారి మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికల బరిలో ఉండగా టీడీపీ నుండి కొత్తగా కిమిడి కళా వెంకట్రావు బరిలో ఉన్నారు.
అయితే ఇక్కడ టీడీపీ ఇంచార్జిగా కిమిడి నాగార్జున కొనసాగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కిమిడి నాగార్జునకు టిక్కెట్ దక్కలేదు. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన కిమిడి నాగార్జున అప్పటి నుండి నియోజకవర్గంలోనే ఉంటూ స్థానిక క్యాడర్‌తో పాటు ప్రజలతో మమేకమై రాజకీయాలు చేశారు. అయితే ఆఖరి క్షణంలో కిమిడి నాగార్జునను ప్రక్కనబెట్టి కళా వెంకట్రావుకు టిక్కెట్ ఇచ్చింది అధిష్టానం. దీంతో కిమిడి నాగార్జున తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. పలు ఆందోళనలు, నిరసనల రూపంలో తెలియజేశారు. నాగార్జునకు టిక్కెట్ ఇవ్వాలని క్యాడర్ సైతం పట్టుబట్టింది. నాగార్జున కూడా అంతే స్థాయిలో పార్టీపై, కిమిడి కళా వెంకటరావుపై విరుచుకుపడుతున్నారు. తమ సొంత పెద నాన్న అయినా వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా ఇక్కడ త్రిమూర్తుల రాజు, గద్దె బాబూరావులు రెండు వర్గాలుగా ఉన్నారు. వీరికి కొంత వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో టీడీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ ఇక్కడున్న కిమిడి నాగార్జున అసంతృప్తితో పాటు ఇటు మరో రెండు వర్గాలు కళా వెంకట్రావుకు ఏ మేరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది. ఓ వైపు రెండు దశాబ్దాలుగా చీపురుపల్లిలో ఎదురులేని రాజకీయం చేస్తున్న బొత్స, ఆయనకు అంతా తామై నడిపిస్తున్న ఎంపి బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనులు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తుంటే టీడీపీలో మాత్రం ఇంకా పరిస్థితి లేదు. అందులో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుండి చీపురుపల్లికి వచ్చి ఎన్నికల బరిలో దిగుతున్న కళా వెంకట్రావు ఈ ప్రతికూల పరిస్థితులను ఏ మేరకు సెట్ చేసుకుంటారో చూడాలి..
ఏదిఏమైనా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చీపురుపల్లి నుండి ఇద్దరు రాజకీయ ఉద్దండులు పోటీచేస్తున్న నేపద్యంలో ఈ నియోజకవర్గం పైనే ఇప్పుడు అందరి చూపులు ఉన్నాయని చెప్పాలి..