- Advertisement -
అన్ని పార్టీలు బల్దియాపై గురి…
All parties target Baldia...
హైదరాబాద్, జనవరి 11, (వాయిస్ టుడే)
హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది.ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని సీట్లన్నీ గెలుచుకున్న బీఆర్ఎస్..అదే సత్తా చూపించి GHMC ఎన్నికల్లో కూడా పైచేయి సాధించాలని ప్లాన్ చేస్తోంది. అర్బన్ ఏరియాల్లో పట్టున్న బీజేపీ ఈసారి బల్ధియా ఎన్నికలపై పెద్ద కసరత్తే చేస్తోంది. ఇక పాత పట్నంలో బలంగా ఉన్న ఎంఐఎం మేయర్ పీఠం విషయంలో కింగ్ మేకర్‌గా ఉండేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌పై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి..గ్రేటర్ హైదరాబాద్‌లో పొలిటికల్ వ్యవహారాలను తన కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. హస్తం పార్టీ హైదరాబాద్‌లో బలహీనంగా ఉండటంతో..గ్రేటర్ పరిధిలోని కొంతమంది నేతల చేరికలతో బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. GHMC మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే హస్తం గూటికి చేరారు.మేయర్ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. బడ్జెట్‌లో ప్రత్యేకంగా 10 వేల కోట్లు కేటాయించి..మూసీ సుందరీకరణ వంటి అంశాలతో ముందుకు వెళ్తున్నారు. మరోవైపు పొలిటికల్‌గా కూడా..ఆచితూచి వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం సపోర్ట్ లేనిదే వర్కౌట్ అయ్యే పనికాదనే ఆలోచనతో..వారితో సఖ్యతగా ఉంటున్నారు. ఎంఐఎంతో కలుపుకొని వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు.ఇప్పటికే పార్టీ క్యాడర్‌ను కూడా అప్రమత్తం చేసే దిశగా..పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వరుస సమీక్షలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 150 డివిజన్లకు గాను..40 డివిజన్లకుపైగా ఓల్డ్ సిటీలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంఐఎంకు కంచుకోటగా ఉంటాయి. మ్యాజిక్ ఫిగర్ 75ను అందుకోవాలంటే కాస్త కష్టమయ్యే పనే. అందుకే అవసరమైతే ఎన్నికల ఫలితాల తర్వాత ఎంఐఎంతో కలిసి అయినా సరే మేయర్ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి కసరత్తు చేస్తుంది.ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ కూడా వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే స్థానాలన్నింటినీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో నగర ఓటర్లు కచ్చితంగా తమవైపే ఉంటారని ఆశలు పెట్టుకుంటుంది.ఒకవేళ మేయర్ పీఠం దక్కకపోయినా..కింగ్ మేకర్‌గా ఉండాలని ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై గంపెడు ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిన కమలం పార్టీ..ఈసారి మరింత గట్టిగా పనిచేసి..గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించాలని చూస్తోంది.GHMC ఎన్నికల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోతే..మేయర్ పీఠం విషయంలో హంగ్ తప్పనిసరి. అప్పుడు కాంగ్రెస్, ఎంఐఎం ఒకటైతే.. అనివార్యమైతే బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపే అవకాశం లేకపోలేదనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతోంది. ఎన్నికల తర్వాత వచ్చే సీట్లను బట్టి పొలిటికల్ పార్టీల స్టాండ్ మారే అవకాశం ఉంది.ఇప్పటికైతే కాంగ్రెస్, ఎంఐఎం ఒకే దారిలో నడుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎడమొహం, పెడమొహంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీలు GHMC ఎన్నికల ఫలితాల తర్వాత హంగ్ వస్తే మాత్రం..మేయర్ పీఠం కోసం ఒకటి కాక తప్పదన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి మేయర్ పీఠం దక్కించుకునే విషయంలో ఏ పార్టీ అప్పర్ హ్యాండ్ సాధిస్తుందనేది.
- Advertisement -