Monday, December 23, 2024

మిగిలింది కట్టుబట్టలే…..!!!

- Advertisement -

మిగిలింది కట్టుబట్టలే…..!!!

All that is left is commitment…..!!!

ఆకేరు ఉగ్రరూపంతో నిండా మునిగిన గ్రామాలు 1750 ఎకరాల పంట నష్టం, వరదలో కొట్టుకుపోయిన మూగ జీవాలు బురదమయంగా ఉల్లేపల్లి గ్రామం ఇదీ ముంపు బాధితుల గోస ఓ పక్క హోరు వాన.. మరో పక్క మోకాళ్లలోతు నీరు.. ఇండ్లలోకి చేరింది. ఏం జరుగుతుందోనని తెలుసుకునే లోపే అంతకంతకు వరద ఉధృతి.. అందరూ ఇండ్లు.. సామాన్లు.. వదిలిపెట్టి కట్టు బట్టలతో ఎత్తయిన ప్రాంతాలకు, భవనాలపైకి పరుగులు తీశారు. కాసేపట్లో ఆకేరు వాగు గ్రామంలోకి ప్రవహించడం ప్రారంభమైంది. యువత, పెద్దలు అందరినీ అప్రమత్తం చేసి వృద్ధులు, మహిళలు, పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాఢ అంధకారంలో ఏరు ఉధృతి పెరుగుతుండటంతో బిక్కుబిక్కుమంటూ తెల్లవారేవరకు గడిపారు. తెల్లవారినా వరుణుడు కరుణించకపోవడంతో ఉల్లేపల్లి గ్రామంలోని సుమారు 90 ఇండ్లు, బాల్ని ధర్మారం గ్రామంలో 21 ఇండ్లు, సీతారాం తండాలో 46 ఇండ్లు పూర్తిగా నీటమునిగాయి. 1989 తర్వాత ఇంతటి ఉపద్రవం తమ గ్రామంలో ఎప్పుడూ చూడలేదని, అప్పటికంటే ఇప్పుడు మరింత అధికంగా ప్రవాహం ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఇది.. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని ఆకేరువాగు ఉగ్ర రూపానికి ఆకేరు పరివాహక ప్రాంతంలో తల్లడిల్లిన గ్రామాల దుస్థితి. ఉల్లేపల్లి గ్రామానికి ఎగువన ఉన్న ఊర చెరువు, వీరారం చెరువు, జమ్మి చెరువు, తుమ్మల చెరువు కట్టలు తెగి ఆకేరులో కలవడంతో వరద ఇరుపక్కలా కిలోమీటర్ల మేర విస్తరించింది. వరద ఉధృతికి బయట తలదాచుకున్న గ్రామస్తులు మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఎటు చూసినా బురదే దర్శనమిచ్చింది. అంతా రైతు కుటుంబాలే.. గత వేసవిలో అందరూ వడ్లు పండించి బియ్యాన్ని ఇండ్లల్లో వేసుకున్నారు. వరద తాకిడికి సుమారు 500 క్వింటాళ్లపైనే బియ్యం వరదల్లో పనికి రాకుండా పోయింది. దాంతో ఏ ఇంట్లోనూ బియ్యం లేని పరిస్థితి. నిత్యావసరాలు, విలువైన పత్రాలు కూడా తడిచి పనికి రాకుండా పోయాయి. సుమారు 70 ఇండ్లల్లో వంట సామాన్లు కూడా కొట్టుకుపోయి, గృహోపకరణాలు పాడై సర్వస్వం కోల్పోయారు. ఇండ్లల్లో బురద పేరుకుపోవడంతో రెండ్రోజుల నుంచి శుభ్రం చేస్తున్నా కొలిక్కిరాని పరిస్థితి నెలకొందని పలువురు బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆకేరు వరద నీరు గ్రామంలోకి దూసుకురావటంతో ఇంట్లో ఉన్న ధాన్యం, జొన్నలు, పత్తి, కందులు, పెసలు వంటి పంటలు మొత్తం తడిచి పనికి రాకుండా పోయాయి. మోర వెంకన్న, మోర వీరన్నల 10 క్వింటాల పెసలు, బేతమల్లు శ్రీనుకు చెందిన 10క్వింటాళ్ల పత్తి, కొలిచెలమల శాంతయ్య 120 క్వింటాళ్ల ధాన్యం, కొలిచెలమల వెంకన్న 100 క్వింటాళ్ల ధాన్యం తడిచి ముద్దైంది. వరద ధాటికి ఉల్లేపల్లిలో 350 ఎకరాలు, బాల్ని ధర్మారం లో 450 ఎకరాలు, సీతారాంతండాలో 100 ఎకరాలు, బిచు రాజుపల్లిలో 350 ఎకరాలు, పురుషోత్తమయగూడెంలో 500 ఎకరాలు, ఆకేరు వాగు పరివాక ప్రాంతంలోని సుమారు 1750 ఎకరాల పంటలు ధ్వంసమైనట్టు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. అధిక శాతం వ్యవసాయ క్షేత్రాల్లో ఇసుక మేటలు వేసి వచ్చే పంట కూడా సాగు చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్టు రైతులు వాపో యారు. ఫర్టిలైజర్స్‌ కూడా కరిగిపోయాయి. గ్రామానికి చెందిన మోర వెంకన్న, వీరన్న, పురుషోత్త మయగూడెంకు చెందిన రూ.50వేల విలువ చేసే ఫర్టిలైజర్స్‌ ధ్వంసమవ్వగా, ఉల్లోజు బంగారి ఇంట్లోని రూ.35వేలు, ప్రతాపరెడ్డి ఇంట్లో రూ.50వేలు కొట్టుకుపోయినట్టు బాధితులు తెలిపారు. 70 శాతం ఇండ్లు నీట మునగడంతో ఆరు రోజుల నుంచి గ్యాస్‌ వెలిగించిన పరిస్థితి లేదు. బియ్యం లేక, నిత్యావసరాలు కూడా పూర్తిగా పాడవటంతో ఆహార తిప్పలు తప్పటం లేదు. వ్యాపారులకు సైతం తీరని నష్టం.. గ్రామంలోని తవిసి గోవర్థన్‌, తవిసి జయమ్మ, ఉప్పల వెంకన్నలు కిరణా షాపులు నిర్వహిస్తుండగా ముగ్గురివి కలిపి సుమారు రూ.2లక్షల మేర సామాన్లు వరదలో కొట్టుకుపోయినట్టు తెలిపారు. గ్రామంలో రెండు ఫర్టిలైజర్‌ షాపులుండగా మాలోత్‌ తిరుపతికి చెందిన షాపులో సుమారు రూ.70వేలు, నరేష్‌కు చెందిన షాపులో సుమారు రూ.50వేల విలువ చేసే ఫెస్టిసైడ్స్‌ కొట్టుకుపోయాయని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థిక చేయూత అందించాలని వేడుకున్నారు. కొనసాగుతున్న పారిశుధ్యం, వైద్య శిబిరం.. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశానుసారం గ్రామంలో నష్టపోయిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. స్థానిక కాంగ్రెస్‌ నేతలు గ్రామంలో పలువురు దాతల సహకారంతో నిత్యావసరాలు అందిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌ ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముంపునకు గురైన ఇండ్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అక్కడ మేము ఉండము సారో.. : గుగులోతు ప్రకాష్‌ (రైతు), సీతారాం తండా ఈ వరద తాకిడికి మేము ఇక్కడ ఉండలేము సారు. మాకు కాస్త ఎక్కడైన జాగ చూపి ఇల్లు కట్టించండి. గోడలు నానిపోయి ఉన్న ఇండ్లు కూలే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యే చొరవ తీసుకొని మాకు ఎక్కడైనా ఇండ్లు కట్టించి ఇవ్వాలి.గ్యాస్‌ వెలిగించక ఆరు రోజులైంది : బోడ బుజ్జి, సీతారాం తండా మా తండాలో ఆరు రోజుల నుంచి ఎవరు కూడా గ్యాస్‌ ముట్టియ్యలేదు. గ్యాస్‌ మొద్దులు, పొయ్యిలు కొట్టుకుపోయాయి. ఉన్న గ్యాస్‌ పనిచేయడం లేదు. బంధువుల సహాయంతో ఆహారం అందుతుంది. బట్టలు ఆరక ముక్క వాసన వస్తున్నాయి. చుట్టుపక్కల దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్నం. ప్రభుత్వం మాకు ఎక్కడైనా వేరే చోట ఇండ్లు కట్టించివ్వాలి. వరద పోయింది.. బురద మిగిలింది :శ్రీలత, అంగన్‌వాడీ టీచర్‌(ఊల్లేపల్లి) చిమ్మ చీకటి.. ఒక్కసారిగా వరద ఇంటి మీదికొచ్చింది. ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితికి గురయ్యాం. పిల్లలను వెంటబెట్టుకొని గుట్టలవైపు చేరుకున్నాం. ఇంట్లో ఉన్న సామాన్లు కొట్టుకుపోయాయి. సర్టిఫికెట్లు సైతం చేతికి అందకుండా పోయాయి. చివరికి వరద పోయింది.. బురద మిగిలింది. అంగన్‌వాడీ సెంటర్‌కు సంబంధించిన క్వింటాల్‌ బియ్యం కూడా కొట్టుకుపోయాయి. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్