మన్యం ప్రజల కష్టాలకు చలించిన అల్లూరి సీతారామరాజు
-ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం:
మన్యం ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అల్లూరి సీతారామరాజు జయంతిని ప్రభుత్వం తరఫున నిర్వహించారు. తొలుత సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీనివాస్, టిడిపి నేత వలవల బాబ్జీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ బాణాలతో ఏం చేయలేమని గుర్తించి పోలీస్ స్టేషన్ దగ్గర దాడి చేసి వందలాది ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అటువంటి వ్యక్తి జయంతిని ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా ప్రభుత్వ పరంగా నిర్వహించడం పట్ల సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన మృతి చెంది 103 ఏళ్ళు గడిచినప్పటికీ స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇటువంటి మహత్తర కార్యక్రమంలో తనను భాగస్వాములను చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. క్షత్రియ సేవా సమితి తరపున అల్లూరి విగ్రహాన్ని అందిస్తే ట్యాంక్ బండపై మరింత అందంగా ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జీ మాట్లాడుతూ భారతదేశ చరిత్ర పుటల్లో అల్లూరి సీతారామరాజు పేరు నిలిచిపోతుందన్నారు. అటువంటి అల్లూరి మన ప్రాంతానికి చెందిన వ్యక్తి గా ప్రాచూర్యం పొందడం గర్వకారణం అన్నారు. ఆయన పోరాటాలు ఫలితంగానే మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామని గుర్తు చేశారు. గాంధీ, నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి వంటి మహనీయులు అహింసా మార్గంలో పోరాడారన్నారు. ఉద్యమాన్ని నడిపించగల వ్యక్తుల్లో అల్లూరిది ప్రథమ తాంబూలం అని పేర్కొన్నారు. ఆయన జీవితం అందరికీ తెలిసే విధంగా పాఠ్యాంశంగా చేర్చడం అదృష్టం ఉన్నారు. అలాగే ప్రభుత్వపరంగా అల్లూరి జయంతిని నిర్వహించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ నేత ఈతకోట తాతాజీ మాట్లాడుతూ భీమవరంలో 125 జయంతి సందర్భంగా నాడు భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వపరంగా అల్లూరి జయంతిని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ, క్షత్రియ సేవా సమితి ప్రతినిధి సిహెచ్ ఏ ఆర్ కే వర్మ, పేరిచర్ల్ల మురళీ, ఉమ్మడి నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
మన్యం ప్రజల కష్టాలకు చలించిన అల్లూరి సీతారామరాజు

- Advertisement -
- Advertisement -