అమిత్ షా… వెంటనే మోడీ
హైదరాబాద్, మార్చి11
తెలంగాణపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెంచింది. రాష్ట్రంలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ హైకమాండ్.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం షెడ్యూల్ కూడా రెడీ అవుతోంది. మంగళవారం బీజేపీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీ శ్రేణులతో సమావేశం కానున్న అమిత్ షా.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు, పార్టీ ఆఫీస్ బేరర్‌లతో సమావేశం కానున్న అమిత్ షా.. పలు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. ప్రతి బూత్ లో ఓటర్లను సమీకరించేందుకు.. ఇతర రాష్ట్రాల్లో అవలంభించిన విధానం గురించి హోంమంత్రి నేతలకు సూచించే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం గత పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు హోంమంత్రి తెలియజేస్తారు. ప్రధాని మోదీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు.ఇదిలాఉంటే.. కొద్దిరోజుల క్రితం తెలంగాణలోని పర్యటించి ఆదిలాబాద్, సంగారెడ్డి సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ నెల 16, 18, 19 తేదీల్లోనూ రాష్ట్రంలో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. జగిత్యాల, నాగర్‌కర్నూల్, మల్కాజ్‌గిరిలో మోదీ సభలకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూడు పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. దీంతో మోదీ సభలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. దీంతోపాటు 17న చిలకలూరిపేట ఎన్డీయే సభలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అమిత్ షా… వెంటనే మోడీ
- Advertisement -
- Advertisement -