
హైదరాబాద్, ఆగస్టు 15, (వాయిస్ టుడే): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఆదివారంతో తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ సీట్లు 19,049 మిగిలి పోయాయి. మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ మేరకు 19 వేల వరకు సీట్లు మిగిలిపోయినట్లు సాంకేతిక విద్య విభాగం వెల్లడించింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లు 3,034 వరకూ మిగిలిపోయాయి. సివిల్, మెకానికల్ సీట్లను అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ముందే భారీగా తగ్గించుకున్న సంగతి తెలిసిందే. ఈ బ్రాంచీల్లో దాదాపు 7 వేల సీట్లకు కోత పడింది. కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సుల్లో సీట్లు బారీగా పెరిగాయి. వీటితోపాటు కొత్తగా కంప్యూటర్ సైన్స్ సంబంధిత బ్రాంచీల్లో మరో 7 వేల వరకూ సీట్లు పెరిగాయి.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వినర్ కోటా కింద 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే.. వాటిల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులే 56,811 ఉన్నాయి. వివిధ కంప్యూటర్ బ్రాంచుల్లో సీట్లు పెరగడంతో టాప్ 20 కాలేజీల్లో సీట్లు వంద శాతం భర్తీ అయ్యాయి. అంతగా పేరు ప్రఖ్యాతులులేని, గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రం కంప్యూటర్ కోర్సుల్లో కూడా సీట్లు మిగిలిపోయాయి.ఆయా కాలేజీలు ముందే సీట్ల సంఖ్యను తగ్గించుకున్నా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రాకల్స్, సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లు తక్కువగా ఉన్నప్పటికీ వాటిల్లోనూ భారీగా సీట్లు మిగిలి పోయాయి. మిగిలిపోయిన అన్ని సీట్లకు ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.



