ఇక కేరళం…
తిరువనంతపురం, జూన్ 26,
కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో తీర్మానం శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అయితే సీఎం పినరయి ప్రవేశపెట్టిన తీర్మానానికి విపక్షాలు కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. గతేడాది ఆగస్టు 9వ తేదీన కూడా కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాజ్యాంగంలో ఈ విషయాన్ని మొదటి షెడ్యూల్, ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరింది. తొలి తీర్మానం పరిశీలన తర్వాత, కొన్ని మార్పులు చేయాలని కోరింది కేంద్ర ప్రభుత్వం. దీంతో మార్పులు చేసిన తర్వాత తాజాగా మరోసారి రాజ్యాంగంలోని ఎనిమిదో జాబితాలో పేరు మార్పు విషయాన్ని చేర్చాలనే తీర్మానాన్ని పంపింది కేరళ ప్రభుత్వం.కేరళ పేరును అన్ని భాషల్లోనూ కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని పినరయి సర్కార్ కోరింది. రాష్ట్రంపేరును పూర్వం నుంచే మలయాళం అని పిలిచేవారని, మలయాళం మాట్లాడే ప్రజల కోసం ఐక్య కేరళ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ పూర్వ కాలం నుండే ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. కేరళల సాంస్కృతిక నేపధ్యం, చరిత్రను దృష్టిలో ఉంచుకుని కేరళంగా పేరు మార్చాలనే డిమాండ్ అన్నివర్గాల ప్రజలనుంచి ఉందన్నారు. మరోవైపు దేశంలో ఏదైనా రాష్ట్రంపేరును మార్చాలంటే రాజ్యాంబద్దంగా కేంద్రం ఆమోదం పొందాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోనే ఆ రాష్ట్రం పేరును మార్చాల్సి ఉంటుంది. రాష్ట్రం పేరు మార్చడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధికి సంబంధించిన అంశం. మరి ఈసారైనా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కేరళ మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
ఇక కేరళం…
- Advertisement -
- Advertisement -