ఈ ఎన్నికలు ఆంధ్రోళ్లకు మనకు జరిగే యుద్దమే
బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ నవంబర్ 14: ఆంధ్రోళ్లు ఢిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారని.. ఆంధ్రోళ్లకు మనకు జరిగే యుద్దమే ఈ ఎన్నిక అని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లాలోని కొత్తపల్లి మండలం మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోని గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించిన మంత్రి గంగుల తాను చేసిన అభివృద్ధి పనులు… తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు వివరించి మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌ను గెలిపిస్తే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఒక్క రోజు కూడా గ్రామాల ముఖం చూడనటువంటు వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేసేదేమీ ఉండదని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ దొంగలకు ఓటు వేసి పవిత్రమైన ఓటును వృధా చేసు కోవద్దన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లోనే సుభిక్షంగా ఉంటుందని..మోసపోతే గొసపడక తప్పదని అన్నారు.కాంగ్రెస్, బీజేపీ నాయకులు దొంగలు..మోసగాళ్లు అని వారి పట్ల తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. తనకు ఓటు వేసి గెలిపించి ఐదు సంవత్సరాలు సేవ చేసుకొనే భాగ్యాన్ని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి శ్రీలత, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాసరపు శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ గొట్టె జ్యోతి, ఎంపీటీసీ పండుగ లక్ష్మీ నర్సయ్య, బీఆర్ఎస్ నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, ఉప సర్పంచ్ కాసారపు గణేష్ గౌడ్,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగాధర లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.