అంగన్వాడి కేంద్రాలు మరింత మెరుగ్గా నిర్వహించాలి
Anganwadi centers should be managed better
– గర్భిణీ ల ఆరోగ్యాన్ని రెగ్యులర్ గా మానిటర్ చేయాలి
– పోషక లోపం గల పిల్లలకు బాలామృతం ప్లస్ సరఫరా చేయాలి
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి ప్రతినిధి:
జిల్లాలో ఉన్న అంగన్వాడి కేంద్రాలను మరింత మెరుగ్గా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ పనితీరు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
అంగన్ వాడి కేంద్రాల పనితీరు, అంగన్వాడి కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు లబ్ధిదారుల వివరాలు, ప్రీ స్కూల్ నిర్వహణ, అనేమియా నివారణ మొదలగు వివరాలను కలెక్టర్ సంక్షేమ అధికారి అడిగి తెలుసుకున్నారు. నెలలో ఎన్ని అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేశారు, అక్కడ గమనించిన పరిస్థితులు మొదలగు వివరాలను కలెక్టర్ సూపర్వైజర్ లను ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రాల నిర్వహణ మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని, పిల్లలకు యూనిఫామ్ ఎక్కడా కనపడలేదని, అంగన్ వాడి టీచర్లు సమయపాలన పాటించడం లేదని, కేంద్రాల నిర్వహణ శుభ్రంగా లేదని, ఈ పరిస్థితుల్లో వెంటనే మార్పులు రావాలని కలెక్టర్ సూపర్ వైజర్ లకు తెలిపారు. అంగన్వాడి కేంద్రాలను సకాలంలో ఓపెన్ చేయాలని, పిల్లలకు యూనిఫామ్ పంపిణీ చేయాలని, పిల్లలు శుభ్రంగా ఉండాలని, బురద, చెత్త లో ఆడుకుంటున్నట్లు పిల్లలను గమనిస్తే టీచర్ల నుంచి సూపర్ వైజర్, సిడిపిఓ వరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. సామ్, మాల్ న్యూట్రిషన్ సంబంధించి వాస్తవిక పరిస్థితులు రిపోర్ట్ చేయాలని, ఎంత ఎక్కువ మంది గుర్తిస్తే అంత మంచిదని కలెక్టర్ తెలిపారు. గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకుంటున్నారో లేదా, ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా అనే అంశం పై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, గర్భిణీ మహిళలకు సంబంధించి ప్రతి అంశాన్ని ట్రాక్ చేసుకునెలా అంగన్వాడీ కేంద్రాల వద్ద వ్యవస్థ ఏర్పాటు చేయాలని, గర్భిణుల ఏఎన్సీ రిజిస్ట్రేషన్, చెక్ అప్ సకాలంలో జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ప్రీ స్కూల్లో పిల్లల అటెండెన్స్ తగ్గకుండా చూసుకోవాలని, అంగన్ వాడి కేంద్రాలలో పిల్లల ఎదుగుద లను రెగ్యులర్ గా పరీక్షించాల ని, పిల్లలకు యూనిఫామ్ సరిగ్గా ఉండాలని, ప్రతి సూపర్ వైజర్ పరిధిలో ఉన్న అంగన్ వాడి కేంద్రాల సమస్య లు చర్చల ద్వారా పరిష్కరిం చాలని, అనవసరమైన ధర్నాలకు ఆస్కారం ఇవ్వవద్దని కలెక్టర్ తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ఎదుగుదలను 100% మానిటరింగ్ చేయాలని, పోషణ లోపంతో బాధపడే పిల్లలను గుర్తించి వారికి బాలామృతం ప్లస్ సరఫరా అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ సూచించారు. అంగన్ వాడి కేంద్రాలలో గుడ్లు, బాలామృతం ప్లస్ కు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని అన్నారు.
పోషణ లోపంతో ఎత్తు తక్కువ, బరువు తక్కువ గల పిల్లలను గుర్తించాలని, వారి కోసం నిర్దేశించిన సూపర్వైజడ్ సప్లిమెంట్ ఫీడింగ్ ప్రోగ్రాం సంబంధించిన వీడియోలు గ్రూపులలో షేర్ చేస్తూ, ఆ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని అన్నారు. సంక్రాంతి నాటికి జిల్లాలో అనాథ శరణాయాలకు, అనాథ పిల్లలకు సంబంధించిన సంపూర్ణ వివరాలను సేకరించి నివేదిక అందించాలని కలెక్టర్ అన్నారు. ఆర్.బి.ఎస్.కే వైద్యుల వచ్చి వైద్య పరీక్షలు నిర్వసిస్తున్నారా, పిల్లలకు ఎవరికైనా గుండె సంబంధిత జబ్బులు మొదలగు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని పిల్లలకు మెరుగైన వైద్యం తక్షణం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం రంగంపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న సఖి కేంద్రం భవనాన్ని కలెక్టర్ సందర్శించి పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసి , జనవరి 1 నూతన సంవత్సరంలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఈఈ పంచాయతీ రాజ్ ను కలెక్టర్ ఆదేశించారు. ఎస్సీ రెసిడెన్షి యల్ హాస్టల్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను పరిశీలించారు. సుల్తానాబాద్ లో నిర్మాణం అవుతున్న వృథాశ్రమం, బాలల సదనం పనులు పరిశీలించి, త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశం లో ఈఈ పంచాయతీ రాజ్ గిరిష్ బాబు, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.