- Advertisement -
అరెస్ట్ కోసం అన్నా, చెల్లి తహతహ…
Anna, sister want to arrest...
హైదరాబాద్, డిసెంబర్ 17, (వాయిస్ టుడే)
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చిక్కులు తప్పేలా లేవు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీవో ప్రకారం తెలంగాణ తల్లిని అవమానించకూడదని తెలిసినా ఎందుకు ధిక్కరించారు? తనంతట తానుగా అరెస్టు కావాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారా? ఫార్ములా ఈ – రేస్ విషయంలో కేటీఆర్ అరెస్ట్ తప్పదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనతో కవిత పోటీ పడుతున్నారా? జీవోను ధిక్కరిస్తున్నానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చి మరీ బహిరంగంగా ఎందుకు కామెంట్ చేశారు? ప్రజలను రెచ్చగొట్టే తీరులో ఎందుకు వ్యవహరించారు? ఇలాంటి అనేక సందేహాలు ఉన్నా ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఆమెపై చర్యలు తప్పవనే వార్తలు వినిపిస్తున్నాయి. వేర్వేరు రూపాల్లో జగిత్యాలలో స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి ఫిర్యాదులు వస్తున్నందున దానికి అనుగుణంగా ఆమెపై చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు.రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న జారీ చేసిన జీవో (నెం. 1946)లో “తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపించడం నిషేధం. తెలంగాణ తల్లి చిత్ర రూపురేఖలను బహిరంగ ప్రదేశాలలోగానీ, ఇతర ప్రదేశాలలోగానీ, ఆన్‌లైన్‌లోగానీ, సామాజిక మాధ్యమాలలోగానీ, మాటలు లేదా చేతలతో అగౌరవపర్చడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేడం, అవమానించడం లేదా కించపరచడం నేరంగా పరిగణించబడుతుంది” అని స్పష్టంగా పేర్కొన్నది.ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత పట్టించుకోలేదు. “ప్రభుత్వ జీవోలను ధిక్కరించి 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ తల్లి రూపాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. ఉద్యమ తెలంగాణ తల్లిని గ్రామగ్రామానా ప్రతిష్ఠించుకుంటాం. గెజిట్ ఇచ్చినా, కేసులు పెట్టినా భయపడేది లేదు” అని జగిత్యాలలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి రూపాన్ని అవమానించేలా వ్యాఖ్యానిస్తే నేరమవుతుందని, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిసినా ధిక్కరిస్తున్నా అంటూ కామెంట్ చేసి మరీ సవాల్ చేశారు.ఎమ్మెల్సీగా ఉన్న కవిత, ప్రభుత్వ ఉత్తర్వులను స్వయంగా ఉల్లంఘించడంతో పాటు ప్రజలను రెచ్చగొట్టేలా, వారిని ఉద్రేకపరిచేలా బహిరంగ ప్రదేశంలో వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. జీవోకు వ్యతిరేకంగా మాట్లాడడం నేరమని తెలిసినా ఘాటు స్వరంతో వ్యాఖ్యానించడంతో స్వయంగా ఆమె అరెస్టును కోరుకుంటున్నారా? అనే మాటలూ స్థానికంగా పొలిటికల్ లీడర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఫిర్యాదుల ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు ఉంటాయనే చర్చ మొదలైంది. ప్రభుత్వాన్నే సవాల్ చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఆమె ప్రస్తావించారు.జీవో ప్రకారం తెలంగాణ తల్లిని అవమానించకూడదని తెలిసినా ఉద్దేశపూర్వకంగా ధిక్కరణకు పాల్పడడాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గానే తీసుకునే అవకాశమున్నది. ఇప్పుడు ఉపేక్షిస్తే ఇంకొందరు కూడా ఇదే తీరులో రెచ్చిపోతారని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, ఇప్పుడు గట్టి చర్యలు తీసుకోవడం ద్వారా పునరావృతం కాకుండా చూసుకోవచ్చన్నది పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం భావన. ఎమ్మెల్సీ కవిత వ్యవహార శైలిపై ఎలాంటి చర్యలుంటాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.తప్పు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి పలుమార్లు హెచ్చరించారు. సినీ హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై వివిధ పార్టీల నేతలు పోలీసుల తీరును తప్పుపట్టినా సీఎం రేవంత్ మాత్రం, చట్టం ముందు అందరూ సమానులే అంటూ ఢిల్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. నిజానికి అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ మాకు బంధువు, మా పార్టీకి చెందినవారు అని సీఎం గుర్తుచేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎవ్వరూ అతీతులు కారు, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకున్నారు అంటూ సమర్ధించుకున్నారు.ఈ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితపైనా చట్టపరమైన చర్యలు తప్పవనే చర్చ మొదలైంది. తెలంగాణ తల్లిని అవమానించకూడదని తెలిసినా ధిక్కరిస్తున్నానంటూ గుర్తుచేసి మరీ ఉల్లంఘించిన కవిత పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా ఉండకపోవచ్చనేది ఆ చర్చల్లోని సారాంశం. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా చట్టాల పట్ల విధేయతన, గౌరవాన్ని ప్రదర్శించడానికి బదులుగా ప్రజలను రెచ్చగొట్టేలా, ఉల్లంఘించవచ్చంటూ సందేశమిచ్చేలా కవిత వ్యవహరించడం హాట్ టాపిక్‌గా మారింది.
మరో వైపు ఫార్ములా ఈ – రేస్ వ్యవహారంలో ఎమ్మెల్యే కేటీఆర్‌ను ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) విచారించడానికి గవర్నర్ అనుమతి మంజూరు చేయడంతో అరెస్ట్ తప్పదేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ ఆయన సైతం ప్రభుత్వానికి సవాల్ విసిరే తీరులో పలుమార్లు కామెంట్ చేశారు. ఈ సంగతిని ముందుగానే ఊహించిన ఎమ్మెల్సీ కవిత, అన్న కంటే ముందుగానే మరోసారి అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారేమో అనే చర్చలకు ఆస్కారం ఇచ్చినట్లయింది. రానున్న రోజుల్లో వీరిద్దరి పట్ల ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే ఉత్కంఠ మొదలైంది.
- Advertisement -