మధ్యప్రదేశ్ లో పదకొండేళ్ల చిన్నారిపై దుండగులు దారుణ అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన బాలికను సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. రాత్రి వరకూ చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించి చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టారు. చివరకు మరుసటి రోజు ఇంటికి దగ్గర్లోని అడవిలో పాపను దారుణ స్థితిలో గుర్తించారు.
రక్తపుమడుగులో కనిపించిన కూతురును చూసి కన్నీరుమున్నీరయ్యారు.. పాప శరీరంపై ఎక్కడ చూసినా పంటిగాట్లే ఉన్నాయని స్థానికులు తెలిపారు. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం ఆసుపత్రి బెడ్ పైన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని వివరించారు.
సాత్నా జిల్లాలోని మైహర్ టౌన్ ఆర్కండీ టౌన్ షిప్ లో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ టౌన్ షిప్ లో గురువారం ఓ బాలిక కనిపించకుండా పోయింది. రాత్రి వరకూ పాప తిరిగి రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన తల్లిదండ్రులు.. చుట్టుపక్కల వెతికారు. టౌన్ షిప్ కు దగ్గర్లోనే ప్రఖ్యాతి పొందిన శారదా మాతా ఆలయం ఉంది. ఆలయం పక్కనే ఉన్న అడవిలో పాప చావుబతుకుల మధ్య స్థానికులకు కనిపించింది. రక్తపు మడుగులో పాపను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు పాపను ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశామని, నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.