రంగారెడ్డి జిల్లా :ఆగస్టు 11: శంషాబాద్‌లో సంచలనం రేపిన దిశ రేప్ అండ్ మర్డర్ ఎంత సంచలనం రేపిందో తెలియనిది కాదు. అదే తరహాలో నిన్న రాత్రి మహిళ దారుణ హత్య సంచలనం రేపింది. శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల స్థలాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు మహిళను దారుణంగా హత్య చేసి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం స్థానికులకు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కాళ్లకు మెట్టెలు ఉండటంతో వివాహితగా గుర్తించారు. మహిళకు 35 – 36 ఏళ్లు ఉండొచ్చని సమాచారం.
రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. శంషాబాద్ లో సంచలనం రేపిన దిశ రేప్ అండ్ మర్డర్ తర్వాత ఇది రెండవ కేసు కావడం గమనార్హం. అసలు ఆ మహిళ ఎవరు? ముందుగానే చంపేసి అక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా? వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దర్యాప్తులో సీసీ టీవీ ఫుటేజ్ కీలకం కానుంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలు ఈ కేసు విషయమై రంగంలోకి దిగాయి…