తెరపైకి మరో రియల్ మోసం
మెదక్, మే 22, (వాయిస్ టుడే)
వాళ్లంతా పైసా పైసా కూడబెట్టి రాజధాని నగరానికి సమీపంలో ఉన్నదని ఓ వెంచర్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. విక్రేతలు ఫ్లాట్ల గురించి వివరించి, మురికినీటి కాల్వలు, పార్కులు, దారుల గురించి వివరించి అమ్మేశారు. ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కొనుగోలు దారులు వెళ్లడంతో వారికి దారి లేదని ఆ భూమి యజమాని చెప్పడం ఖంగుతిన్నారు. తమకు సహాయం చేయాలని పోలీసులను ఆశ్రయించి న్యాయ పోరాటానికి దిగారు. ఈ ఘటన మేడ్చల్ మండలం గౌడవరంలో వెలుగులోకి వచ్చింది.మేడ్చల్ మండలం, గౌడవెల్లి గ్రామంలోని 939, 1000, 1001 సర్వే నెంబర్లలోని 8 ఎకరాల 15 గుంటల భూమిని యజమానులైన ఏర్పుల ఝాన్సీ లక్ష్మీ, ఏర్పుల కృష్ణ, ఏర్పుల లక్ష్మణ్ నుంచి హనీషా హోమ్స్ సంస్థ నిర్వాహకులు ఫణిందర్, సంజీవరావు తీసుకుని వెంచర్లు వేశారు. 180, 200 గజాల చొప్పున మొత్తం 118 ఫ్లాట్లుగా విభజించారు. ఈ ఫ్లాట్లలోకి వెళ్లడానికి 1015 సర్వే నెంబర్‌లోని 13 గుంటల భూమిని రోడ్డుగా కొనుగోలుదారులకు చూపించారు. రాజధాని నగరానికి దగ్గరలో ఉండటం, ఫ్లాట్లు కూడా అందుబాటులో ధరలో ఉండటంతో మేడ్చల్‌తోపాటు హైదరాబాద్, సిద్దిపేట, గజ్వేల్, నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్ సహా పలు ప్రాంతాలకు చెందిన వారు ఇందులో ఫ్లాట్లు కొనుక్కున్నారు. మొత్తం 118 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి.తాజాగా లేఔట్‌లో చూపిన దారిని మూసివేసి, ఆ దారిని ఉపయోగించే హక్కు ఎవరికీ లేదంటూ ఆ భూమి యజమాని హరి ప్రసాద్ అడ్డుకుంటున్నారని ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు బోరుమంటున్నారు. ఆర్మూర్‌కు చెందిన పరమేశ్, నగరానికి చెందిన రవీందర్, ఎటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన కవిత, కుత్బుల్లాపూర్‌కు చెందిన జయరాంతోపాటు బాలరాజు, వెంకట్ రెడ్డి, వెంకటరమణ, అశోక్, బాలరాజ్, తదితరులు ఆందోళన చెందుతున్నారు. ఫ్లాట్లు కొనేటప్పుడు చూపించిన దారికి సంబంధించి 2018లోనే ఎంవోయూ జరిగిందని, అందుకు సంబంధించిన పత్రాలను కూడా వారు చూపిస్తున్నారు. ఇప్పుడు రోడ్డు లేదంటూ ఇబ్బంది పెట్టడం సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు.మల్లన్నసాగర్‌లో పోయిన భూమికి వచ్చిన డబ్బులతో ఈ ఫ్లాటు కొన్నామని కవిత తెలిపారు. అక్కడ భూమి పోయినా ఇక్కడ దొరికిందని సంతోషపడ్డామని, కానీ, రోడ్డు లేదని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. రోడ్డు ఉన్నదనే కదా ఫ్లాటు కొనేది.. అప్పుడు రోడ్డు ఉందని చూపించిన వ్యక్తి ఇప్పుడు గేటు పెట్టాడని, గోడ కట్టాడని అన్నారు. పైసా పైసా పోగు చేసుకుని ఇల్లు కడుదామనుకుంటే ఇబ్బంది పెడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. దారి కోసం ఒక్క ఫ్లాటుకు రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయారు.ఆరేళ్ల కింద ఫ్లాటు కొన్నానని, తన మిత్రుడితో కూడా 200 గజాల ఫ్లాటు ఇప్పించానని పరమేశ్ చెప్పారు. ఫ్లాటు కొనుగోలు సమయంలో హరిప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు చూపించిన రోడ్డును.. ఇప్పుడు లేదని డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రహరీ గోడ కట్టి, అక్కడికి వెళ్తే రాళ్లతో దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గౌడవెల్లి ఫ్లాట్ల యజమానుల ఫిర్యాదుపై సీఐ సత్యనారాయణ వివరణ కోరగా.. స్పందించారు. న్యాయం ఎటు వైపు ఉంటే తాము అటు వైపే నిలుస్తామని స్పష్టం చేశారు. చట్ట పరిమితులకు లోబడి బాధితులకు న్యాయం చేస్తామని వివరించారు.
తెరపైకి మరో రియల్ మోసం
- Advertisement -
- Advertisement -