వాషింగ్టన్ అక్టోబర్ 26: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మైనే రాష్ట్రంలోని లెవిస్టన్‌లో దుండగులు జరిపిన మాస్ షూటింగ్‌లో 22 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారికోసం గాలిస్తున్నామని చెప్పారు.ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ పోలీస్ కార్యాలయం వారి ఫేస్ బుక్ పేజీలో అనుమానితుడి ఫొటోలను విడుదల చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, అన్ని వ్యాపార సంస్థలను మూసివేయాలని సూచించారు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని కోరారు.