లిక్కర్ కేసులో మరో ట్విస్ట్..! కవితను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితకు కష్టాలు రెట్టింపయ్యాయి. లిక్కర్ స్కామ్ కేసులో కవితను గురువారం అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఆమెను శుక్రవారం ఉదయం 10.00 గంటలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరుపరిచారు. 5 రోజుల పాటు కవితను సీబీఐ కస్టడీకి కోరారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు ప్రదేశాల్లో ఈ స్కామ్ కు సంబంధించిన సమావేశాలు జరిపినట్లు చెబుతోంది సీబీఐ.
కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఇందులో విజయ్ నాయర్, మాగుంట శ్రీనివాసులు సహా అనేక మంది ముఖ్యనేతలు ఉన్నట్లు స్పష్టమవుతోందని చెబుతోంది సీబీఐ. సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు సమీకరించినట్లు వాట్సప్ చాట్ ధృవీకరిస్తోందని చెబుతున్నారు సీబీఐ తరఫు న్యాయవాదులు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను, ఆధారాలను కోర్టుకు అందజేశామన్నారు. అందుకే ఆమెను విచారించాలని ఢిల్లీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తిని కోరుతోంది సీబీఐ. ఈ కేసులో విచారణ జరిపితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటోంది.
ఇప్పటికే ఈడీ దర్యాప్తులో భాగంగా అరెస్టై జైలులో ఉన్న కవిత మరోసారి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆమె బయటకు రావాలంటే ఒకటి కాదు రెండు బెయిల్స్ తెచ్చుకోవాలి. ఒకే కేసు రెండు అరెస్ట్‌లకు కారణమయ్యింది. ఈడీ అరెస్ట్‌తో ఇప్పటికే తిహార్ జైలులో ఉన్న కవితను.. సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి కవిత.. కుట్రకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది.
మరోవైపు ఎలాంటి నోటీసు లేకుండా కవితను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ.. సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జ్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు ఆమె తరఫు లాయర్లు. అయితే తన ముందు లిక్కర్ కేసు వాదనలు జరగలేదన్న జడ్జి మనోజ్‌కుమార్.. ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు కోర్టులో పిటిషన్ వేయాలని సూచించారు.
మద్యం పాలసీ కేసులో గత నెల 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేశారు. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగించింది కోర్టు. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈనెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆమె బయటకు రావాలంటే ఈడీ కేసులోనే కాదు సీబీఐ కేసులోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ కేసు..కవితను గట్టిగానే పట్టుకున్నట్టు కనిపిస్తోంది.