28.7 C
New York
Sunday, June 23, 2024

రివర్స్ లో ఏపీ రాజకీయాలు

- Advertisement -

రివర్స్ లో ఏపీ రాజకీయాలు
విజయవాడ, మే 24, (వాయిస్ టుడే )
ఆంధ్రప్రదేస్ రాజకీయాలు రివర్స్ లో కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికలప్పుడు ఏం జిరగిందో ఇప్పుడు అలాగే జరుగుతున్నట్లుగా కళ్ల ముందు కనిపిస్తోంది. అప్పట్లో అధికార పార్టీగా ఉన్న టీడీపీ ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ అదే  పని చేస్తోంది. ఎన్నికలు సక్రమంగా జరగలేదని అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు సీఈవోగా ఉన్న  గోపాల కృష్ణ ద్వివేదీ ఆఫీసుకు వెళ్లి మరీ ఫైరయ్యారు. ఇప్పుడు సీఈవో ముఖేష్ కుమార్ మీనాపై వైఎస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు ఎన్ని జరిగినా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసేవారు. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ కూడా అదే అంటోంది. పోలింగ్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే.. తమ ఫ్లాగ్ షిప్ నినాదం 175కి  175 గెలుస్తామని అంటోంది. అయితే ఈ పరిణామాలు మాత్రం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాపై వైఎస్ఆర్‌సీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. టీడీపీతో కుమ్మక్కయి ఆయన ఎన్నికలు నిర్వహించారని  అంటున్నారు. పల్నాడులో ఘర్షణలకు ఆయనే  కారణం అని ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు అధికారుల్ని మార్చారని.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి రావడం వైసీపీ ఆగ్రహాన్ని మరింతగా పెంచింది. ఎందుకంటే పోలింగ్ బూత్‌ల లోపల ఏం జరిగిందన్న సీసీ కెమెరా దృశ్యాలు సాధారణంగా బయటకు రావు. అలా వచ్చాయంటే ఖచ్చితంగా ఈసీ అఫీసు నుంచే  రావాల్సి ఉంటుంది. ఎలా వచ్చిందో తెలియదు కానీ వీడియో పది రోజుల తర్వాత  బయటకు వచ్చింది. ఈ వీడియో బయటకు రావడాన్ని వైసీపీ తీవ్రంగా ఆక్షేపించింది. టీడీపీతో సీఈవో కుమ్మక్కయ్యారన్నదానికి ఇంత కన్నా సాక్ష్యం ఏముంటుందని అంబటి రాంబాబు అంటున్నారు. పలు చోట్ల రీపోలింగ్ కు అడిగినా ఇవ్వడం లేదు.. ఆయా చోట్ల జరిగిన ఘర్షణల వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. అయితే పోలింగ్ బాగా  జరిగిందని ఈవీఎంలు ధ్వంసం చేసినా ఓట్లు ఎక్కడికి పోలేదని..ఆయా చోట్ల మళ్లీ కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఒక్క చోట కూడా రీపోలింగ్ కు ఆర్వోలు సిఫారసు చేయలేదు. సీఈవో కూడా అనుమతి ఇవ్వలేదు. అందుకే ఈసీ పక్షపాతిగా పని చేస్తున్నారని ఇప్పటికే నిష్పక్షపాతంగా పని  చేయాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. 2019లో అధికార పార్టీగా ఎన్నికలకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ కూడా అప్పటి సీఈవోపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదీ ఉండేవారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ తమపై పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపణలు ప్రారంభించింది. డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ సహా చాలా జిల్లాల్లో ఎస్పీలను మార్చేశారు. చివరికి చీఫ్ సెక్రటరీని కూడా మార్చేశారు. చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఎన్నికలకు ముందు నియమించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో సీఎంగా చంద్రబాబు ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేకుండా పోయింది. వైఎస్ వివేకా  హత్య కేసును దర్యాప్తు చేస్తున్న కడప ఎస్పీని కూడా ఈసీ బదిలీ చేసింది. అలాగే ఎన్నికల ప్రక్రియలో లోపాలపై టీడీపీ మండిపడింది. పోలింగ్ రోజు కొన్ని వందల చోట్ల ఈవీఎం మెషిన్లలో లోపాలు బయట పడ్డాయి. ఈ కారణంగా  పోలింగ్ కూడా ఆలస్యమయింది. ఈ పరిణామాలన్నింటితో ఈసీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. సీఈవో కార్యాలయానికి వెళ్లి ధర్నా చేసినంత పని చేశారు. పైగా మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తయ్యాయి. కౌంటింగ్ కు రెండు నెలలకు పైగా సమయం ఉన్నా.. చీఫ్ మినిస్టర్ గా ఏమీ చేయడానికి ఈసీ అనుమతులు ఇవ్వలేదు. అందుకే అప్పట్లో ఎన్నికల సంఘంపై టీడీపీ తీవ్రంగా విరుచుకుపడింది.  ఎన్నికల ప్రక్రియపై ఏదైనా రాజకీయ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తే.. రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఓ రకమైన నెగెటివ్ ప్రచారం ప్రారంభమవుతుంది. అప్పుడే ఓటమికి కారణాలు చెబుతున్నారన్న అభిప్రాయం బలపడుతుంది. తెలుగుదేశం పార్టీకి 2019లో ఇలాంటి అనుభవమే ఎదురయింది. అప్పట్లో ఈసీ పని తీరును వైసీపీ నేతలు విమర్శించలేదు. పైగా బాగా పని చేసిందని కితాబిచ్చారు కూడా. ఓటమికి కారణాలు చెబుతున్నారని వైసీపీ నేతలు టీడీపీపై విరుచుకుపడేవారు. ఇప్పుడు అదే పరిస్థితి వైఎస్ఆర్‌సీపీకి వచ్చింది. పల్నాడు, చిత్తూరు, తాడిపత్రి వంటి చోట్ల జరిగిన  దాడుల వ్యవహారంలో మొత్తం వైసీపీదే తప్పని నిందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తున్నారు. టీడీపీ భారీగా రిగ్గింగ్ చేసిందన్న అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ఎక్స్ లో ట్రెండింగ్ లోకి కూడా తెచ్చారు. అయితే టీడీపీ మాత్రం.. ఇవన్నీ వైసీపీ ఓటమికి కారణాలుగా ముందే చెబుతోందని .. అంటున్నారు. 2019లో  ఈసీ ఇంత కంటే యాక్టివ్్ గా ఉందని అప్పుడు ఎందుకు కరెక్ట్ గా ఉందని అనిపించిందని ప్రశ్నిస్తున్నారు. కొసమెరుపేమిటంటే అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు బూత్ లలో రిగ్గింగ్ జరిగిందని వైసీపీ నేతల డిమాండ్  తో  రీపోలింగ్ నిర్వహించారు. కానీ ఇప్పుడు అలాంటి డిమాండ్లు ఉన్నా ఈసీ పట్టించుకోవడం లేదు. వైసీపీ చేస్తున్న ఆరోపణలతో ఆ పార్టీ ఓటమికి కారణాలు వెదుక్కుంటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం గెలిచి తీరుతున్నామని గట్టిగా చెబుతున్నారు. రెండో సారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించారు. ముహుర్తాన్ని ప్రకటించారు. ప్లేస్ ను జగన్ ముందే  ప్రకటించారు. విశాఖలో హోటల్స్ కూడా బుక్ చేసుకున్నామని.. బోగాపురంలో ప్రమాణస్వీకార స్థలాన్ని సీఎస్ జవహర్ రెడ్డి కూడా పరిశీలించారని అంటున్నారు. అయితే ఇవన్నీ మైండ్ గేమ్ కోసమేనని.. వైసీపీ ఓడిపోతుందని వారికి కూడా తెలుసని.. టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కారణం ఏదైనా ఈ సారి ఎన్నికలు అచ్చంగా 2019లో జరిగినట్లే కనిపిసున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో జూన్ నాలుగో తేదీన క్లారిటీ వస్తుంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!