మున్నూరుకాపు నాయకుడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి: అపెక్స్ కౌన్సిల్ డిమాండ్
Apex Council demands Munnurukapu leader to be included in the cabinet

మున్నూరుకాపు నాయకుడిని వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోవాలని, బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు పర్చాలని మున్నూరుకాపుల అత్యున్నత నిర్ణాయక మండలి అయిన అపెక్స్ కౌన్సిల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసింది.సంఘం గౌరవాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షతన సోమవారం రాత్రి జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నూతన అధ్యక్షుడు పుటం పురుషోత్తం రావు పటేల్ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు వీ.ప్రకాష్,సీ.విఠల్, రౌతు కనకయ్య,బొంతు రాంమోహన్,మీసాల చంద్రయ్య, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితర ప్రముఖులు హాజరై పలు అంశాలపై సమాలోచనలు జరిపారు.రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మున్నూరుకాపు నాయకుడు లేకపోవడం విచారకరమని,గతంలో ఏనాడు కూడా ఇటువంటి పరిస్థితి దాపురించలేదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది.తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని వెంటనే మంత్రిమండలిలోకి తీసుకుని ప్రాధాన్యత కలిగిన శాఖను కేటాయించాలని, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్స్ అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మున్నూరుకాపు ప్రముఖులు డిమాండ్ చేశారు.తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులకు ఏ మాత్రం ప్రాధాన్యత లేని శాఖలిచ్చి ప్రభుత్వ పాలనకు దూరం పెట్టడమే కాక ఏసీబీ దాడులతో భయభ్రాంతులకు గురి చేయడాన్ని సమావేశం తప్పుబట్టింది.రాష్ట్ర జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరుకాపులను మరింత ఐక్యం చేస్తూ,చైతన్యపరుస్తూ సంఘాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయాలని సమావేశంలో మాట్లాడిన వక్తలు అభిప్రాయపడ్డారు.ఇందులో భాగంగా రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించాలని, హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభను జరపాలని,ఇతర బీసీ కులాల వారితో స్నేహం పెంచుకుంటూ రాజ్యాధికారం వైపు ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.ఈ సందర్భంగా సంఘం నూతన అధ్యక్షుడు సర్థార్ పుటం పురుషోత్తమ రావు, ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య, కోశాధికారి కంచె సత్యనారాయణ, కార్యనిర్వహక అధ్యక్షులు బుక్కా వేణుగోపాల్, డాక్టర్ జే.ఏన్.వెంకట్,చల్లా హరిశంకర్, మహిళా విభాగం అధ్యక్షురాలు బండి పద్మక్క, నాయకులు ఉప్పు రవీందర్,వాసాల వెంకటేశ్వర్లను శాలువాలతో సత్కరించారు.సంఘం ఎన్నికలను పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల ప్రధానాధికారి జే.డీ.లక్మీనారాయణ, అధికారులు మంగబాబు,ఎర్రా నాగేంద్రబాబు,న్యాయ సలహాదార్లు లవంగాల అనిల్,ఊసా రఘులను సమావేశానికి హాజరైన వారంతా అభినందించారు.



