Wednesday, April 23, 2025

మళ్లీ గులాబీ గూటికి ఆరూరి రమేష్

- Advertisement -

మళ్లీ గులాబీ గూటికి ఆరూరి రమేష్

Aruri Ramesh again to the BRS

వరంగల్, నవంబర్ 27, (వాయిస్ టుడే)
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ మళ్లీ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. అరూరి తిరిగి బీఆర్ఎస్ బాట పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ కార్యక్రమాల్లో ఆయన పెద్దగా పాలుపంచుకోకపోవడం ఈ ప్రచారానికి ఊతం ఇస్తున్నాయి.దాదాపు పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగి, ఎంపీ ఎలక్షన్స్ కు ముందు బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ మళ్లీ యూటర్న్ తీసుకోబోతున్నారా? కాషాయ కండువా వదిలి మళ్లీ కారు ఎక్కనున్నారా? వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే చర్చ జోరుగా నడుస్తోంది. బీజేపీ నుంచి లోక్ సభ బరిలో నిలిచిన ఆయన.. ఆ ఎన్నికల్లో ఓటమి తరువాత ఎక్కడా సరిగా కనిపించకపోవడం, పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాలుపంచుకోకపోవడం ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారానికి కారణం అయ్యాయి. దీంతో మళ్లీ ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారనే చర్చకు దారితీశాయి. అధికారికంగా అరూరి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలకు కాస్త అటుఇటుగా ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం గురించి ఆయన తన సన్నిహితులతో చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.అరూరి రమేష్ 2009 ఎలక్షన్స్ టైమ్ లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తరువాత తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్థిగా 2014 లో పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ పై దాదాపు 86 వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పగిడిపాటి దేవయ్యపై 99 వేలకు పైగా ఓట్లు సాధించి బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ఇలా రెండు సార్లు రికార్డు మెజారిటీతో విజయం సాధించిన ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లక్షకు పైగా మెజారిటీ సాధిస్తాననే ధీమాతో బరిలో నిలిచారు. కానీ వ్యక్తిగతంగా ఆయన క్యాడర్ పై ఉన్న వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ కు వచ్చిన హైప్ తో ఆయన చిత్తుగా ఓటమి పాలయ్యారు. దాదాపు 19,458 ఓట్ల తేడాతో అరూరి రమేశ్ కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో ఓటమి చవి చూశారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత అరూరి రమేశ్ తన వ్యూహం మార్చుకున్నారు. ఎలాగైనా పవర్ లో ఉండాలనే ఉద్దేశంతో ఎంపీగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే లాభం లేదనే ఉద్దేశంతో నాటకీయ పరిణామాల నడుమ బీజేపీ లో చేరారు. అనుకున్నట్టుగానే బీజేపీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకుని వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. ప్రధానిగా మోదీకి ఉన్న క్రేజ్, క్షేత్రస్థాయిలో బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంక్ తో ఎంపీగా గెలుపు తనదేనని భావించారు. కానీ పార్టీ మారినా క్షేత్రస్థాయిలో ఆయనతో పాటు ఆయన అనుచరులపై ఉన్న వ్యతిరేకత, అసెంబ్లీ ఎన్నికలతో కాంగ్రెస్ కు పెరిగిన బలం వల్ల ఆయన లోక్ సభ ఎన్నికల్లో కూడా ఓటమి చెందారు. వరంగల్ ఎంపీగా డాక్టర్ కడియం కావ్య గెలవగా.. ఆయన రెండో స్థానానికి పరిమితం అయ్యారు.లోక్ సభ ఎన్నికల తర్వాత అరూరి కొంతకాలం పార్టీ జిల్లా నేతలు, కార్యకర్తలతో టచ్ లోనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో మాత్రం పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరం ఉంటున్నట్టు తెలిసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీ హై కమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అక్కడ పని చేసిన ఆయన.. జిల్లాలో మాత్రం బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు టాక్ నడుస్తోంది. పార్టీ కార్యక్రమాల గురించి ఆయనకు సమాచారం ఇచ్చినా అంటిముట్టనట్టే ఉంటున్నట్టు పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. వివిధ సందర్భాల్లో పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మారెడ్డి, గంట రవి నిర్వహించిన కార్యక్రమాలు, మీడియా సమావేశాలకు సమాచారం ఇచ్చినా ఆయన సరిగా స్పందించడం లేదనే ప్రచారం జరుగుతోంది. అరూరికి సమాచారం ఇచ్చినా ఆయన మాత్రం ఏ కార్యక్రమానికి హాజరవడం లేదని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతుండటం గమనార్హం.కారణాలు ఏవైనా అరూరి రమేష్ యూ టర్న్ తీసుకోబోతున్నారనే చర్చ నియోజకవర్గంలో జోరుగా నడుస్తోంది. పంచాయతీ ఎన్నికలకు కాస్త అటుఇటుగా ఆయన గులాబీ కండువా కప్పుకుంటారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ మళ్లీ యాక్టివ్ గా అడుగులు వేస్తుండటం, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇంతవరకు బీఆర్ఎస్ నేతలెవరూ ఆయన స్థానాన్ని భర్తీ చేయకపోవడంతో అరూరి కారు పార్టీ వైపు ఆలోచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉంటే మహారాష్ట్ర ఎన్నికల తరువాత వరంగల్ కు వచ్చి శుభకార్యాలు, సంతాప కార్యక్రమాలకు హాజరవుతున్న ఆయన పార్టీతో సంబంధం లేకుండా తన వ్యక్తిగత క్యాడర్ ను బలోపేతం చేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగినా ఇబ్బందులు తలెత్తకుండా అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్టు తెల్సింది.కాగా ఆయన పార్టీ మారే వ్యవహారం అంతా తూచ్ అని కొందరు కొట్టిపారేస్తున్నా.. పంచాయతీ ఎలక్షన్స్ కు రిజల్ట్స్ ను బట్టి ఆయన బీఆర్ఎస్ వైపు అడుగులు వేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదివరకు ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి చేరుతున్న సమయంలో కూడా ఇలాగే ప్రచారం జరగగా.. పార్టీ మారే విషయాన్ని ఆయన పలుమార్లు ఖండించారు. తాను పార్టీ మారబోయేది లేదంటూ ప్రెస్ మీట్ లు పెట్టి మరీ చెప్పుకొచ్చారు. కానీ చివరకు నాటకీయ పరిణామాల నడుమ ఆయన ఊహించినట్టుగానే బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు కూడా అరూరి రమేష్ విషయంలో అదే జరుగుతుందనే టాక్ నడుస్తుండగా.. ఎవరి వాదన నిజమవుతుందో చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్