రేవంత్ ఇంటికిక్యూ కడుతున్న ఆశావహులు
హైదరాబాద్, మార్చి 25
Aspirants lining up for Revanth's house
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం అమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు మంత్రి వర్గ విస్తరణకు సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజా మంత్రి వర్గ విస్తరణలో కనీసం నలుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయనున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. సీఎం రేవంత్ బృందం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ భేటీలో పాల్గొ న్నారు.కాంగ్రెస్ పెద్దలతో జరిగిన భేటీలో తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం కల్పించాలనే అంశాలపై చర్చించారు. దీంతో పాటు ఏప్రిల్ 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే అంతర్జాతీయ అంతర్జాతీయ సదస్సుపై సుదీర్ఘంగా చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు వివరించాయి. హైదరాబాద్‌లో జరిగే భారత సంవిధాన్ సమావేశాలకు సుమారు 80 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేతలతో జరిగిన భేటీలో తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై ఎక్కువగా చర్చ జరిగినట్టు నేతలు వివరించారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రి వర్గంలో ఆరుగురి కి చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి నలుగురికి అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. మిగిలిన రెండు ఖాళీలను మరో సారి భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరగడంతో కూర్పుపై ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.
మంత్రి వర్గంలో చోటు దక్కేది వీరికే…
2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రి వర్గంలో ఉండటంతో ఇద్దరికి అవకాశం ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్‌లో చేరే సమయంలో హామీ ఇవ్వడంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్‌కు కూడా మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవిపై హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి వర్గంలో ఎవరికి స్థానం దక్కలేదు.మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికు కూడా మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం హామీ ఇచ్చారు. తాజా విస్తరణలో ఆయనకు కూడా చోటు దక్కుతుందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రి వర్గంలో ఆరు ఖాళీలను భర్తీ చేస్తే ఎస్టీ, మైనార్టీవర్గాలకు చోటు దక్కనుంది.మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఐలయ్య, ఆది శ్రీనివాస్, బాలూనాయక్, మురళీనాయక్, రాంచంద్రునాయక్, ప్రేమ్ సాగర్ రావు పేర్లపైన కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. డిప్యూటీ స్పీకర్‌గా లంబాడా వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు అవకాశం కల్పించనున్నారు. చీఫ్ విప్ పదవిగా ఆది శ్రీనివాస్ పేరు ప్రచారం జరుగుతోంది.
మంత్రివర్గ విస్తరణకు పచ్చజెండా
తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు, కార్పొరేషన్ పదవుల భర్తీపై చర్చ జరిగినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. అన్ని విషయాలపై లోతుగా సమాచారం తీసుకున్నారని త్వరలో అన్ని విషయాలూ కొలిక్కివస్తాయని ఆశి స్తున్నట్టు చెప్పారు. తమ నుంచి సమగ్ర సమాచారం తీసుకున్నారని తుది నిర్ణయం ఏఐ సీసీ తీసుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు వివరించారు. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై త్వరలో ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.