హైదరాబాద్, జూలై 28, (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 3వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ మీటింగ్ లో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు అస్త్రాలను సిద్దం చేసుకోంటున్నాయి. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై ఆయన అసెంబ్లీ సెషన్స్ లో ప్రస్తావించే ఛాన్స్ ఉంది. మరో వైపు రాష్ట్ర ప్రజల సమస్యలపై కేసీఆర్ సర్కార్ పై కమలం పార్టీ కూడా సభలో ప్రశ్నలను సంధించేందుకు అవకాశం ఉంది. ఇంకో వైపు తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను కూడా ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు. ఎందుకంటే.. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో ఈ అసెంబ్లీ సెషన్స్ ను అధికార, విపక్షాలు సీరియస్ గా తీసుకొనే ఛాన్స్ ఉందని పొలిటికల్ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చే అంశంతో పాటు భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఛాన్స్ ఉండగా.. మరో వైపు విపక్షాలకు ప్రభుత్వం కూడా కౌంటర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం ఏ రకమైన కార్యక్రమాలను చేపట్టిందో వివరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక, చూడాలి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా కొనసాగుతాయి అనేది.

31న కేబినెట్ భేటీ
తెలంగాణ రాష్ట్రానికి వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈనేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 31న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వ్యవసాయ రంగం, ముంపు ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. భారీ వర్షాలతో పాటు ముప్పైకి పైగా అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. చాలా జిల్లాల్లో పంట నష్టం కూడా జరిగింది.ఈ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ముంపు గ్రామాల ప్రజలకు ఆర్థిక సాయం, ఇతర అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో వరదల కారణంగా జరిగిన నష్టంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల గురించి సమాచారం చర్చించబడుతుంది. రోడ్ల పునరుద్ధరణ చర్యలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు తదితర అంశాలపై చర్చించనున్నారు.గత రెండు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు అన్ని రికార్డులను బద్దలు కొట్టాయి. శుక్రవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ముందుజాగ్రత్త చర్యగా ఈరోజు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో 8 మంది చనిపోయారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో ములుగు జిల్లాలో 649.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా అత్యధికంగా 24 గంటల వర్షపాతం రికార్డును బద్దలు కొట్టింది. తెలంగాణ రాష్ట్రం ఇదే కాలంలో సగటు వర్షపాతం 97.7 మిల్లీమీటర్లు కురిసింది, ఇది మునుపటి ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది