Sunday, September 8, 2024

అసెంబ్లీ సరే… కౌన్సిల్ లో సంగతేంటి

- Advertisement -

హైదరాబాద్, డిసెంబర్ 9, (వాయిస్ టుడే): తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అధికార మార్పిడి జరిగింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికార పీఠాన్ని అధిష్టించింది. ఇప్పుడు మరో ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పాలన కొనసాగనుంది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మంత్రి వర్గం కూడా కొలువు దీరింది. అయితే రానున్న కాలమంతా అధికార పార్టీకి ఇబ్బందులు తప్పేట్లు లేవు. కేవలం ఎన్నికల మ్యానిఫేస్టోనే కాదు… చట్ట సభల్లో కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ కు మొత్తం 64 స్థానాలు, సీపీఐకి ఒక స్థానం మొత్తం 65 స్థానాలు దక్కాయి. అదే ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌కు 39, ఎంఐఎంకు 7, బీజేపీకి ఎనిమిది స్థానాలు సాధించాయి. అంటే విపక్ష సభ్యుల సంఖ్య 54 మంది వరకూ ఉంది. ఇక్కడే కొంత ఇబ్బంది కరమైన పరిస్థిితి ఏర్పడుతుంది. శాసనసభలో ప్రతిపక్షం నుంచి గట్టి వాయిస్ వినిపించేందుకు అన్ని పార్టీలూ సిద్ధపడతాయి. బీఆర్ఎస్, ఎంఐఎం దాదాపు మిత్రపక్షాలు కావడం, జాతీయస్థాయిలో బీజేపీ కాంగ్రెస్ కు శత్రువు కావడంతో ప్రజా సమస్యలపై కాదు…ప్రతి బిల్లును అడ్డుకునేందుకు అవి ప్రయత్నించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపించకమానేలా లేవు. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బలమైన ప్రతిపక్షం లేదు. బీఆర్ఎస్ దే వాయిస్. అది అనుకున్నట్లే జరిగేది. ఉన్న ప్రతిపక్ష పార్టీల్లోని ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలోకి చేర్చుకుని ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ చేయగలిగారు. కానీ ఇప్పుడా పరిస్థితి మాత్రం లేదు. ఖచ్చితంగా విపక్ష పార్టీలు ప్రశ్నిస్తాయి. వాటి ప్రశ్నలకు ప్రభుత్వం తప్పించుకోవడానికి వీలులేదు. సమాధానం చెప్పేవరకూ నిలదీస్తాయి. శాసనమండలిలో కాంగ్రెస్ కు బలం లేదు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొందినా మండలిలో దానిని తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనూ అదే సీన్ కనిపించింది. మూడు రాజధానుల బిల్లులను శాసనసభలో బలమున్న వైసీపీ ఆమోదించి శాసనమండలికి పంపితే అక్కడ బిల్లును వెనక్కు తిప్పి పంపారు. గవర్నర్ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు తక్కువే. ఈ నేపథ్యంలో బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నీ కష్టాలే. శాసనమండలిలో బీఆర్ఎస్ కే ఆధిక్యం ఉండటం, కాంగ్రెస్ కు తక్కువ స్థానాలు ఉండటంతో ఏపీ సీన్ ఇక్కడ రిపీట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. శాసనమండలి ఛైర్మన్ కూడా బీఆర్ఎస్ కు చెందిన వారే కావడంతో ఇక మండలిలో హస్తం పార్టీకి ఇక్కట్లు తప్పేలా లేవు.  ముఖ్యమైన బిల్లుల విషయంలో బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలకు సరైన జవాబు ఇచ్చేంత వరకూ వదిలిపెట్టరు. మండలి ఛైర్మన్ కూడా ప్రతిపక్షానికి చెందిన వారు కావడంతో పెద్దల సభలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఖచ్చితంగా తలెత్తుతాయి. అయితే రెండు సార్లు సభ ఆమోదించి పంపిన తర్వాత ఖచ్చితంగా శాసనమండలి ఆమోదించాల్సి రావడం కొంత ఊరట అయినా ప్రతి కీలక బిల్లుకు కష్టపడాల్సి ఉంటుంది. టెన్షన్ పడక తప్పదు. అలాగని బిల్లులు ఆమోదించుకోకుండా ఉండలేని పరిస్థితి. తాము ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలుచేయాలి. ముఖ్యంగా భవిష్యత్ లో మండలిలో తన బలం పెంచుకునేంత వరకూ కాంగ్రెస్ కు ప్రాబ్లమ్స్ తప్పేట్లు లేవు. అలాగని బలం పెంచుకునే అవకాశమూ లేదు. పెద్దగా సంఖ్యాబలంలో తేడా లేకపోవడంతో చాలా సమయం పట్టేందుకు అవకాశముంది. ఈ పరిస్థితి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా బయటపడుతుందన్నది చూడాల్సి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్