తమ సిబ్బందిపై దాడిచేస్తే సహించేది లేదు: సజ్జనార్
దాడికి గురైన సిబ్బందిని పరామర్శించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
ఇకపై తమ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయి: సజ్జనార్
దుండగుల చేతిలో దాడికి గురైన తమ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) వీసీ సజ్జనార్ బుధవారం పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. టీఎస్ఆర్టీసీ అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
కాగా ఫరూక్‌నగర్ డిపోకు చెందిన 8ఏ రూట్ బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారని, ఈ ఘటనలో కండక్టర్ రమేష్, డ్రైవర్ షేక్ అబ్దుల్‌కి గాయాలయ్యాయని టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈ నెల 4న జరిగిందీ సంఘటన. ఉద్దేశపూర్వకంగా సిబ్బందిపై దుండగులు దాడికి పాల్పడ్డారని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించిన హైదరాబాద్ కమిషనరేట్ దోమల్‌గూడ పోలీసులు నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను సోమవారం అరెస్ట్ చేశారని తెలిపారు
ఇకపై టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. నిబద్దత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే ఇలాంటి దాడులను టీఎస్ఆర్టీసీ ఏమాత్రం సహించదని, నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, ఈడీలు కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, తార్నాక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, ఆస్పత్రి ఓఎస్డీ సైది రెడ్డి, తదితరులు ఉన్నారు.



