Thursday, September 11, 2025

లయోలకు అటానమస్ రద్దు…

- Advertisement -

లయోలకు అటానమస్ రద్దు…
విజయవాడ, మార్చి 19, (వాయిస్ టుడే)

Autonomous status of Layla...

విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీ అటానమస్‌ హోదాను కృష్ణా యూనివర్శిటీ రద్దు చేసింది. కృష్ణా యూనివర్శిటీ నియమించిన కమిటీ విచారణలో పలు లోపాలను గుర్తించడంతో అటానమస్‌ హోదాను రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. లయోలా కాలేజీలో అకడమిక్‌, ఎగ్జామినేషన్స్‌, ఫైనాన్షియల్‌, జనరల్ అడ్మినిస్ట్రేషన్‌ వ్యవహారాలపై కృష్ణా యూనివర్శిటీ కొద్ది నెలల క్రితం విచారణకు ఆదేశించింది. కమిటీ దర్యాప్తులో పలు ఉల్లంఘనలు గుర్తించారు.యూజీసీ నియమనిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో ఆంధ్రా లయోలా కాలేజీ స్వతంత్ర హోదాను రద్దు చేసి కృష్ణా యూనివర్శిటీ అనుబంధ కళాశాలగా పరిగణించనున్నట్టు పేర్కొన్నారు.ఆంధ్రా లయోలా కాలేజీకి సంబంధించిన అకడమిక్‌, అడ్మినిస్ట్రేషన్‌, కోర్సులు, ఫీజుల వివరాలు, పరీక్షలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌, సర్టిఫికెట్స్‌లను పది రోజుల్లో యూనివర్శిటీకి అప్పగించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిగిలిన అఫిలియేటెడ్‌ కాలేజీలతో పాటు విద్యార్థులకు పరీక్షలను నిర్వహించాలని రిజిస్ట్రార్ ఆదేశించారు.విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీ అటానమస్‌ హోదాను రద్దు చేయడానికి యూజీసీ నియమ నిబంధనలు పాటించకపోవడం కారణంగా చెబుతున్నా అసలు కారణం మాత్రం కాలేజీ ప్రాంగణంలోకి వాకర్లను అనుమతించ పోవడంగా తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా లయోలా కాలేజీ ప్రాంగణంలోకి వాకర్లను అనుమతించాలంటూ స్థానికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇందుకు కాలేజీ యాజమాన్యం నిరాకరిస్తోంది.ఈ వివాదంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోయింది. ముఖ్యమంత్రి కార్యాలయ స్థాయిలో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు కూడా చేసింది. సమీపంలో ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో కాకుండా ప్రైవేట్ కాలేజీ స్థలంలో వాకింగ్‌ కోసం పట్టుబడుతున్నారని లయోలా అభ్యంతరం తెలిపింది.నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా లయోలా కాలేజీలో వాకింగ్‌ చేయడానికి అనుమతి కోసం వాకర్‌ సంఘాలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నాయి. సున్నితమైన ఈ వ్యవహారంలో ప్రభుత్వం నెలల తరబడి ఉదాసీనంగా వ్యవహరించడంతో ఇది కాస్త రాజకీయ రగడగా మారింది. నగరం మధ్యలో ఉన్న ఈ కాలేజీ దాదాపు 100ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.1950వ దశకంలో మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం అవతరించే సమయంలో లయోలా కాలేజీకి అంకురార్పణ జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటైన ఈ విద్య సంస్థ ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యుత్తమ కళాశాలల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. క్యాథలిక్‌ మైనార్టీ విద్యా సంస్థగా.. జెస్యూట్ మిషనరీల ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న లయోలా అనుబంధ సంస్థల్లో ఆంధ్రా లయోలా కాలేజీ ఒకటి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నత విద్యాభ్యాసం కోసం మద్రాసు వెళ్లాల్సిన రోజుల్లో విజయవాడ కేంద్రంగా తెలుగు ప్రజల కోసం ఈ కాలేజీని ఏర్పాటు చేశారు. అప్పట్లో విద్య ప్రాధాన్యతను గుర్తించిన విజయవాడ నగరానికి చెందిన ప్రముఖులు, భూస్వాములు ఈ సంస్థకు భూములను సేకరించడానికి సహకరించారు. కాలేజీ నిర్మాణానికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది దాతలు ఉదారంగా విరాళాలు ఇచ్చారు.ఒకప్పుడు విజయవాడ నగరానికి దూరంగా ఉన్న లయోలా కాలేజీ పట్టణీకరణ నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ నగరం మధ్యలోకి చేరింది. చెన్నై-కోల్‌‌కత్తా జాతీయ రహదారిపై దాదాపు 100ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాలేజీలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నాయి. అధ్యాపకులకు శిక్షణ ఇచ్చే కేంద్రం కూడా ఉంది. కాలేజీ ఆవరణలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్థులకు వేర్వేరుగా హాస్టళ్లు ఉన్నాయి. డిగ్రీ, పీజీ విద్యార్థినులకు కూడా హాస్టళ్లు ఉన్నాయి. విద్యార్థినుల భద్రతా కోణంలో కూడా లయోలా వాకర్ల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తోంది.కాలేజీ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానిక ప్రజలు కొన్నేళ్లుగా కాలేజీ ప్రాంగణంలో వాకింగ్‌ చేస్తున్నారు. మొదట్లో పదుల సంఖ్యలో ఉన్న వాకర్లు ఇప్పుడు వందల సంఖ్యకు చేరుకున్నారు. కోవిడ్‌ 19 ప్రబలిన తర్వాత కాలేజీ ప్రాంగణంలో వాకింగ్ చేయడంపై కాలేజీ యాజమాన్యం ఆంక్షలు విధించింది.వాకింగ్‌కు అనుమతించకపోవడంతో వాకర్ అసోసియేషన్లు… పోలీసులకు, ప్రభుత్వ శాఖలకు, స్థానిక రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేయడంతో కాలేజీలో వాకింగ్ చేయడానికి అనుమతించాలని తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురైనట్టు లయోలా గతంలో ఆరోపించింది. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యం కళాశాల ప్రాంగణంలోకి ప్రైవేట్ వ్యక్తులను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. దీంతో వివాదం మొదలైంది. క్రమంగా ఇది కాస్త రాజకీయ రగడగా మారింది.లయోలా కాలేజీ గ్రౌండ్స్‌లోకి వాకర్లను అనుమతించే విషయంలో వివాదం కొనసాగుతుండగానే కాలేజీ వ్యవహారాలపై యూనివర్శిటీకి ఫిర్యాదులు అందాయి. యూజీసీ అనుమతులు పునరుద్దరించక పోవడంతో పాటు పరీక్షల నిర్వహణ, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాలపై కృష్ణా యూనివర్శిటీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో కాలేజీ అటానమస్‌ హోదాను రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్