డ్రగ్స్ నియంత్రణకై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి …
Awareness programs should be developed for drug control.
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ప్రతి మండల పరిధిలో వారానికి రెండు విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలీ *
సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ వాడకం నివారణపై ప్రచారం చేయాలి
డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు అనువైన స్థలం ఎంపిక చేయాలి
డ్రగ్స్ నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ *
ఖమ్మం
జిల్లాలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ ప్రాధాన్యత అంశంగా అధికారులు పని చేయాలని, ఈ దిశగా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే 3 నెలల పాటు డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ, వీటి వల్ల కలిగే దుష్పరిణామాలపై విస్తృత ప్రచారం నిర్వహించుటకు ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ప్రతి మండలంలో బృందాలు ఏర్పాటు చేస్తూ, వారానికి 2 విద్యా సంస్థలను సందర్శిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.
డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటూ క్యాంపెయిన్ చేపట్టాలని అన్నారు. డ్రగ్స్ వాడకం మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిపే వీడియోలను గ్రామ వాట్సాప్ గ్రూప్ లలో ప్రచారం చేయాలని అన్నారు. మనకు అందుబాటులో ఉన్న స్పీకర్లను గుర్తించి డ్రగ్స్ వల్ల ఆరోగ్యానికి, కుటుంబానికి , ఆర్థికంగా కలిగే నష్టాలను వివరించే విధంగా అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.
సోమవారం నాటికి అవగాహన కార్యక్రమాల్లో ఏం మాట్లాడాలో నిపుణులతో మాట్లాడి ఫైనల్ చేయాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. జిల్లాలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు.
డి- అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు అనువైన భవనం గుర్తించాలని, మాదకద్రవ్యాలు, డ్రగ్స్ అలవాటు ఉన్న వారిని అక్కడ చేర్పించి వారికి అవసరమైన చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసి దాని నిర్వహణ బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేలా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
డ్రగ్స్ కు బానిసలు అయిన యువకులు, పిల్లలపై కేసులు నమోదు కాకుండా వారి భవిష్యత్తు దృష్ట్యా అవసరమైన కౌన్సిలింగ్ చేసి డి అడిక్షన్ సెంటర్ ద్వారా డ్రగ్స్ వాడకం బానిసత్వం పోయేలా చర్యలు తీసుకోవాలని, డి అడిక్షన్ కేంద్రంలో చేరే వ్యక్తుల వివరాలు బయట ఎక్కడ తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లీష్ కు అరగంట, క్రీడలు ఆడేందుకు అరగంట షెడ్యూల్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ, డి.డబ్ల్యూ.ఓ. రాంగోపాల్ రెడ్డి, మధిర షేర్ ఎన్.జి.ఓ. డైరెక్టర్ జి. గోపాల్ రెడ్డి, కౌన్సిలర్ లు గోపాల్ స్వామి, ఎం. హనుమంతరావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.