లక్నో, డిసెంబర్ 13, (వాయిస్ టుడే): హిందువులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం దాదాపు పూర్తయింది. వచ్చే నెలలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగనుంది. రామమందిరానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మరో వెయ్యేళ్ల వరకూ మందిరానికి మరమ్మతులు అవసరం లేనంత పటిష్టంగా నిర్మాణం జరుపుతున్నారు. భూకంపాలను సైతం తట్టుకునే విధంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 6.5 తీవ్రతలో భూకంపం సంభవించినా అయోధ్య మందిరానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. యాభై అడుగుల లోతు నుంచి మందిర స్తంభాలను తవ్వి నిర్మాణం చేపట్టారు. భారీ రాళ్లు, సిమెంట్ తదితరాలను చేర్చి వెడల్పయిన స్తంభాలతో ఈ కట్టడాన్ని రూపొందించారు. పునాదిలో ఎక్కడా స్టీల్ కానీ ఇనుము కానీ వాడకపోవడం విశేషం. రామమందిర నిర్మాణాన్ని 2.7 ఎకరాల్లో చేపడుతున్నారు. 57,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో… 360 అడుగుల పొడుగు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మాణం రూపుదిద్దుకొంటోంది. మూడంతస్తులలో జరుగుతున్న ఈ మహత్తర నిర్మాణానికి 1800 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. విరాళాల రూపంలో 2300 కోట్ల పైచిలుకు మొత్తం వసూలు కావడం గమనార్హం. వచ్చే ఏడాది జనవరి 22న సీతారాముల విగ్రహ ప్రతిష్ట జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశంలోని చాలామంది సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరు కానున్నారు.