అజార్ కు పదవీ గండం
హైదరబాద్, మార్చి 9 (వాయిస్ టుడే )
Azhar’s tenure
అజహరుద్దీన్ ను హడావుడిగా మంత్రిని చేశారు. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎంపిక కావాలి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ వద్ద దానికి సంబంధించిన ప్లాన్ ఏ లేదా ప్లాన్ బీ ఏదీ ఉన్నట్లుగా కనిపించడం లేదు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత గవర్నర్ కోటాలో ఆయన పేరును ఎమ్మెల్సీకి సిఫారసు చేశారు. విషయం కోర్టులో ఉండటంతో.. ఇంత వరకూ గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. పైగా కొత్త గవర్నర్ వస్తున్నారు. ఆయన కూడా నిర్ణయం తీసుకోకపోతే అజహర్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.మైనారిటీ కోటాలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజహర్, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల లోపు ఏప్రిల్ 30, 2026 నాటికి అసెంబ్లీ లేదా కౌన్సిల్ సభ్యుడిగా ఎంపిక కావాల్సి ఉంది. ఈ ప్రక్రియలో ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కులు ఆయన మంత్రి పదవిని సందిగ్ధంలో పడేశాయి.అజహరుద్దీన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం గతంలోనే సిఫారసు చేసింది. అయితే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లను గవర్నర్ తిరస్కరించడంపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అజహర్ నియామకంపై నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇప్పుడు కొత్త గవర్నర్ రాకతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి గవర్నర్ కోటానే ప్లాన్ ఎగా భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ వద్ద ప్లాన్ బిపై స్పష్టత లేకపోవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఒకవేళ కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే, ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఎమ్మెల్సీలలో ఒకరిని రాజీనామా చేయించి ఆ స్థానంలో అజహర్‌ను పంపే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఎవరైనా తమ పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం వంటి ప్రత్యామ్నాయాలు చర్చకు వచ్చినా, అక్కడ ఎన్నికల నిర్వహణకు సమయం సరిపోదు.రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన చర్చ ఏమిటంటే.. ఒకవేళ ఏప్రిల్ 30లోగా ఎమ్మెల్సీ పదవి దక్కకపోతే, అజహర్ మంత్రి పదవికి రాజీనామా చేసి, మళ్ళీ ఒకటి రెండు రోజుల తర్వాత తిరిగి ప్రమాణ స్వీకారం చేయడం. దీనివల్ల ఆయనకు మరో ఆరు నెలల గడువు లభిస్తుంది. అయితే, ఇలా చేయడం వల్ల ప్రభుత్వం తీవ్రమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా, సుప్రీంకోర్టు గతంలో ఇటువంటి పదే పదే ప్రమాణ స్వీకారాలను తప్పుబట్టిన ఉదంతాలు ఉండటంతో, ఈ నిర్ణయం తీసుకుంటే పరువు పోయే ప్రమాదం ఉందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మైనారిటీ ప్రాతినిధ్యం కోసం హడావుడిగా అజహర్‌ను మంత్రిని చేసిన రేవంత్ రెడ్డి సర్కారు, ఇప్పుడు ఆయనను చట్టసభలకు ఎలా పంపాలనే విషయంలో సరైన ప్రణాళిక లేకపోవడంతో చిక్కుల్లో పడింది.



