బాబ్బాబు…
మాట విను…
బుజ్జగింపులో ప్రధాన పార్టీలు
హైదరాబాద్, ఫిబ్రవరి 2
Babbabu…
Listen…
Major parties in the fray
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ఉత్కంఠభరితంగా మారింది. ముందు ఇంటి పోరు గెలిచి, తర్వాత రచ్చ పోరు గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. సొంత పార్టీ వారే లెక్కకు మించి నామినేషన్లు వేయడంతో, ప్రధాన పార్టీలకు వారిని బుజ్జగించడం సవాలుగా మారింది. దీన్ని పరిష్కరించేందుకు ఎక్కడికక్కడ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు.నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పోటీకి దిగిన వారిని తమ దారిలోకి తెచ్చుకోవల్సిన అవసరం ఉంది. మరోవైపు టికెట్ దక్కక దిగులు పడుతున్న వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రత్యర్థి పార్టీ ఎత్తులు వేస్తోంది. ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు మొత్తం 29,694 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో కాంగ్రెస్ నుంచే 10,024 అంటే దాదాపు మూడో వంతు ఉన్నాయి.మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా సగటున కాంగ్రెస్ నుంచి ఒక్కో వార్డుకు మూడుకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ తరఫున 7556 మంది, బీజేపీ నుంచి 5457 మంది నామినేషన్లు వేశారు. ఈ నేపథ్యంలో బరిలో రెబెల్ అభ్యర్థులు లేకుండా చూసేందుకు అన్ని పార్టీల నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహజంగానే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి పోటీ అభ్యర్థులు అధికంగా ఉన్నారు. అత్యధికంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు 328 మంది కాంగ్రెస్ అభ్యర్థులు పోటీకి దిగారు. వీరిలో 268 మందిని ఉపసంహరించుకునేలా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ప్రాతినిధ్యం వహించి ఉండటం, మహబూబ్‌నగర్ పట్టణంతో ఆయనకు మంచి అనుబంధం ఉండటంతో స్థానిక నాయకులు తమ ఉనికి చాటుకునేందుకే పోటీకి దిగారని తెలుస్తోంది.: పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సొంత జిల్లా అయిన నిజామాబాద్ కార్పొరేషన్‌లోని 60 డివిజన్లకు కాంగ్రెస్ నుంచి 319 మంది రంగంలోకి దిగారు. ఇక్కడ కూడా ఉపసంహరణలు సవాలుగా మారే పరిస్థితి ఉంది. ఇక్కడ ఛైర్మన్ ఎన్నికలో మజ్లిస్‌దే కీలకపాత్ర. ఉదాహరణకు గత ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలు గెలిచినా ఛైర్మన్ పదవి దక్కించుకోలేకపోయింది. కేవలం 13 స్థానాలు మాత్రమే పొందిన బీఆర్ఎస్, 15 స్థానాలు వచ్చిన మజ్లిస్‌తో కలిసి కార్పొరేషన్‌ను చేజిక్కించుకుంది.
మజ్లిస్ అండతో : ఇప్పుడు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉండటంతో నిజామాబాద్ కార్పొరేషన్ దక్కించుకోవచ్చన్న ఆశావహ పరిస్థితులే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేయడానికి కారణంగా భావిస్తున్నారు. బీజేపీ నుంచి కూడా ఇక్కడ 252 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకుంది.
గెలుపు కోసం తీవ్ర శ్రమ : 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ తరఫున 308 మంది నామినేషన్లు వేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి తీవ్రంగా పోటీ ఉన్నా కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కూడా అత్యధికంగా 257 మంది నామినేషన్లు వేశారు.
ఒకే కుటుంబం నుంచి ముగ్గురు : మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఇంకో రకమైన పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబం నుంచి ఆయన ఇద్దరు కుమారులు, భార్య నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తన ప్రమేయం లేకుండానే కొందరు నాయకులు అభ్యర్థులను ప్రకటిస్తున్నారన్న ఆగ్రహంతోనే లక్ష్మారెడ్డి ముగ్గురితో నామినేషన్లు వేయించారని తెలుస్తోంది. ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు పార్టీ రాష్ట్ర నాయకులు ప్రయత్నిస్తున్నారు.
నామినేషన్ వేయని అభ్యర్థులు : నల్గొండ కార్పొరేషన్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడి 48 డివిజన్లకు గాను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు 26 డివిజన్లకు తమ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 4వ డివిజన్‌కు కత్తుల నాగేశ్వరి, 20వ డివిజన్‌కు నాంపల్లి అయ్యప్పల పేర్లు ప్రకటించారు. కానీ వీరిద్దరూ నామినేషన్లే వేయలేదు. గడువు కూడా ముగిసింది.



