ఏపీలో ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇవాళ్టి నుంచి గోదావరి జిల్లాల్లో ఉమ్మడి ప్రచారానికి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్ధానిక బీజేపీ నేతలతో కలిసి రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో రోడ్ షోలు, బహిరంగ సభలకు ప్లాన్ చేసుకున్నారు.
ముందుగా ఇరు జిల్లాల్లో పొత్తుల కారణంగా సీట్లు దక్కక అసంతృప్తిగా ఉన్న నేతల బుజ్జగింపులతో ఈ టూర్ ప్రారంభించనున్నారు.
చంద్రబాబు, పవన్ ఇవాళ, రేపు గోదావరి జిల్లాల్లో ప్రచారం, పర్యటనలకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ముందుగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఇవాళ సాయంత్రం 4 గంటలకు రోడ్‌షో ఉంటుంది. తర్వాత వీరిద్దరూ ఉండ్రాజవరం మీదుగా నిడదవోలు చేరుకుంటారు. అక్కడ నిడదవోలు గణేష్‌చౌక్ సెంటర్‌లో రాత్రి రోడ్ షో నిర్వహిస్తా రు. తొలిసారి గోదావరి జిల్లాల్లో వీరిద్దరూ ఉమ్మడిగా ప్రచారం చేయబోతున్నారు. కూటమి విజయం సునాయాసంగా భావిస్తున్న గోదావరి జిల్లాల్లో వీరి ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది.మరోవైపు పొత్తుల్లో భాగంగా చేసిన సీట్ల కేటాయింపుల్లో పలువురు టీడీపీ, జనసేన నేతలకు ఆశాభంగం తప్పలేదు. వీరిలో అమలాపురం, పి.గన్నవరం, తణుకు, నిడదవోలు నేతలు ఉన్నారు. దీంతో ఇవాళ, రేపు ఆయా అసంతృప్త నేతలను పిలిపించుకుని మాట్లాడేలా చంద్రబాబు, పవన్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే రేపు అంబాజీపేట, అమలాపురంలో ఉమ్మడి రోడ్ షోలు, సభలను వీరిద్దరూ నిర్వహిస్తారు. దీంతో గోదావరి జిల్లాల టూర్ ముగియనుంది.