16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్ చేయండి..
ప్రధాని మోదీకి సోనూ సూద్ విజ్ఞప్తి!
న్యూ డిల్లీ జనవరి 30
Ban social media for children under 16 years of age: Sonu Sood appeals to Prime Minister Modi!
పిల్లల భవిష్యత్తు మరియు పెరుగుతున్న డిజిటల్ వ్యసనంపై బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధించాల్సిన అవసరం ఉందంటూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో పిల్లలు భోజనం చేస్తూ కూడా ఫోన్లు స్క్రోలింగ్ చేస్తున్నారని, ఆ విషయాన్ని తల్లిదండ్రులు సైతం పట్టించుకోకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇది మన భవిష్యత్తు కాకూడదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను దూరం చేయడం తక్షణ అవసరమని సోనూ సూద్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసిందని, త్వరలో గోవా ప్రభుత్వం కూడా దీనిని అనుసరించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిని ఒక జాతీయ ఉద్యమంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సోనూ సూద్ స్పష్టం చేశారు. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.


