క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, కిషన్ రెడ్డి సీరియస్
హైదరాబాద్, మార్చి 10 వాయిస్ టుడే
Baton charge on cricket lovers, Kishan Reddy is serious
ఏదైనా మేజర్ టోర్నీ్ల్లో కీలక మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధిస్తే దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు. ఇదే విధంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించి 12 ఏళ్ల తరువాత ట్రోఫీని ముద్దాడింది. దాంతో దేశ వ్యాప్తంగా పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ప్రేమికులు సెలబ్రేట్ చేసుకున్నారు. భారత్ అద్వితీయ ప్రదర్శన చేసి ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గిన అనంతరం ఆదివారం రాత్రి హైదరాబాద్ లో పలుచోట్ల క్రికెట్ ప్రేమికులు రోడ్ల మీదకు వచ్చి బాణసంచా కాల్చారు. జై భారత్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారుఫైనల్లో భారత్ విజయం అనంతరం సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌ను పోలీసులు చితకబాదారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్ ఏరియాలో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ మీద పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి. జాతీయ జట్టు విజయం సాధిస్తే సంబరాలు చేసుకుంటున్న అభిమానులను పోలీసులు పలు ప్రాంతాల్లో చితకబాదారు. దేశంపై తమకు ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంటే అడ్డుకుని, తమపై లాఠీఛార్జ్ చేయడం సరికాదని క్రికెట్ ప్రేమికులు అసహనం వ్యక్తం చేశారు. అయితే లేట్ నైట్ కావడంతో ఆ సమయంలో గుంపులు గుంపులుగా రోడ్లపైకి జనాలు వచ్చి బాణసంచా పేల్చడంతో వాహనదారులు ఇబ్బండి పడతారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని వారిని ఇండ్లకు పంపించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.దిల్‌సుఖ్ నగర్ సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారత్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న అభిమానులను పోలీసులు అడ్డుకోవడం దారుణమంటూ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలిచిన మూమెంట్ ను క్రికెట్ ప్రేమికులు సెలబ్రేట్ చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. జాతీయ జెండాలు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తూ, క్రికెటర్ల అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తుంటే వారిపై లాఠీచార్జ్ చేయడం సరికాదన్నారు. భారత్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న వారిని పోలీసులు ఉరికించి కొడుతున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. ఇది నిజంగా సిగ్గుచేటు అని ఎక్స్ ఖాతాలో కిషన్ రెడ్డి రాసుకొచ్చారు.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ (76) కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. బౌలర్లు సమష్టిగా రాణించడంతో న్యూజిలాండ్ పై మరో 6 బంతులు మిగిలుండగానే 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 2013 తరువాత 12 ఏళ్లకు మరో ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఖాతాలో చేరింది.