మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించాలి
బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ పిలుపు
హైదరాబాద్ / ప్రతినిధి :వాయిస్ టుడే
BCs should be given 50 percent representation in municipal elections
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలు పార్టీలకు అతీతంగా ఎక్కువ సంఖ్యలో గెలిచి రాజకీయ సాధికారత సాధించుకోవాలని బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొండ దేవయ్య పటేల్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలలో కౌన్సిలర్, చెర్మన్ ఎన్నికలు అలాగే 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ ఎన్నికలను బీసీలకు కీలక అవకాశంగా మలుచుకోవాలని ఆయన పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గుర్తులు లేకుండా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు 56 శాతం విజయాన్ని సాధించిన విషయం చరిత్రాత్మకమని, అదే స్ఫూర్తితో ఇప్పుడు జరగనున్న మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం 60 శాతం బీసీలను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకాకపోవడం దురదృష్టకరమన్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థుల్లో 50 శాతం మున్సిపల్ చెర్మన్ పదవులు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నుంచి గెలిచిన వారిలోనూ బీసీ సామాజిక వర్గాలకు 50 శాతం చెర్మన్ పదవులు ఇవ్వాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండున్నర కోట్ల మంది బీసీలపై రాజకీయంగా జరుగుతున్న అన్యాయానికి ఎదురు నిలబడే సమయం ఇదేనని, ఈ ఎన్నికలు బీసీల భవిష్యత్ దిశను నిర్ణయిస్తాయని డాక్టర్ కొండ దేవయ్య పటేల్ అన్నారు. ఈ సమావేశంలో బీసీ సాధికారత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో బీసీ సాధికారత సంఘం కమిటీలను బలోపేతం చేస్తూ, రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ నాయకులు ఎక్కువ సంఖ్యలో పోటీ చేసేలా కృషి చేస్తామని తెలిపారు. బీసీ హక్కుల కోసం పోరాడే నాయకులందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికారత సంఘం రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం నాయకులు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



