భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు హోండెలివరీ,
టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు
ఖమ్మం మార్చి 18, (వాయిస్ టుడే )
Bhadradri Ramulori Kalyana Talambara Home Delivery
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు నేరుగా చేర్చాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎప్పటి లాగానే ఈ ఏడాది కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలను హోండెలివరీ చేసే పవిత్ర కార్యానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.రాములోరి తలంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలతో పాటు వెబ్‌సైట్ లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు ఆర్టీసీ హోండెలివరీ చేస్తుంది.ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు….భద్రాచలం సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు రాములోరి కల్యాణం కన్నులారా చూసేందుకు భద్రాద్రి వెళ్తుంటారు. సీతారాముల కల్యాణం వీక్షించిన అనంతరం తలాంబ్రాలు ఇంటికి తెచ్చుకోవడం ఆనవాయితీ. అయితే భద్రాద్రి వెళ్లకపోయినా రాములోరి కల్యాణ తలంబ్రాలు పొందేందుకు టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ రాములోరి కల్యాణ తలంబ్రాలు హోండెలివరరీ చేస్తుంది.హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో సోమవారం భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించి.. తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు.భద్రాద్రిలో ఏప్రిల్ 6న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ కోరుతోందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ కౌంటర్లతో పాటు ఆన్‌లైన్ ద్వారా కూడా తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లైన 040-69440069, 040-69440000ను సంప్రదించాలని సూచించారు.
దాతలకు ఉచితంగా టిక్కెట్లు
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. రాములోరి కల్యాణం, లోక కల్యాణంగా భావిస్తారు. ప్రతీయేటా భద్రాచలం దేవస్థానంలోని మిథిలా స్టేడియంలో జరిగే ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఈ క్రమంలో స్వామివారి కల్యాణం వీక్షించేందుకు టికెట్లకోసం భక్తులు పోటీ పడుతుంటారు. అయితే, ఈసారి దాతలకు ఉచితంగా రాములోరి కల్యాణం టికెట్లు ఇవ్వనున్నారు.ఈ సంవత్సరం ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణంను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి రూ.50లక్షలకుపైగా విరాళాలు ఇచ్చిన భక్తులకు శ్రీరామనవమి సందర్భంగా (ఏప్రిల్ 6న) మిథిలా స్టేడియంలో జరిగే సీతారాముల కల్యాణంలో పాల్గొనేందుకు ఉచితంగా రెండు టిక్కెట్లు ఇస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. వారికోసం ప్రత్యేకంగా ఒక సెక్టార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, మార్చి 26లోపు రూ.50లక్షలకుపైగా విరాళాలు ఇచ్చిన భక్తులు దేవస్థానంలో లేఖను అందజేయాలని ఈవో సూచించారు.ఏప్రిల్ 6న రాములోరి కల్యాణం సందర్భంగా ఏప్రిల్ 4 నుంచి 7వ తేదీ వరకు దేవస్థానం తరపున కాటేజీలు, గదులు ఇవ్వలేమని, బుకింగ్ ఉండదని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో కోరారు. ఇదిలాఉంటే.. తెలంగాణ ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి మండా వెంకటేశ్వరరావు సీతారాముల కల్యాణానికి రూ.13వేల విలువైన 500 గ్రాముల ముత్యాల తలంబ్రాలను ఈవోకు అందజేశారు.