12.2 C
New York
Wednesday, April 24, 2024

అక్షరాల వెంట పరిగెత్తే భాస్కర్ మంచికట్ల

- Advertisement -
Bhaskar Manhikatla runs along the letters

——-
( మంచికట్ల భాస్కర్ రచించిన కవితా సంపుటి ” ట్రూత్ ” పై విశ్లేషణ )

భాస్కర్ భాస్కరుడే . నీడల తస్కరుడే . కవిత్వ బ్యాటింగ్ లో అపర గవాస్కరుడే . అందుకే 2019 లో ” నడిచే నక్షత్రాలు ” వెలిగించి , 2022 లో ” కిక్ ” కవితా సంపుటిని వెలువరించి , ఇప్పుడు 2024 లో ” ట్రూత్ ” కవితలతో మనముందుకు వస్తున్నాడు . పాఠక లోకం ముందు నిలబడి ” అంతా నిజమే చెప్తాను ” అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు .

భాస్కర్ మంచికట్ల లో నాకు నచ్చిన సుగుణం ఆయనలోని ఉత్సాహం . ఉత్సాహం మనిషికి ఒక ఉద్విజ్ఞ మనస్తత్వాన్నిస్తుంది . హుషారునిస్తుంది . మనసుకు ఒక స్ప్రింగ్ నిస్తుంది . కవిత్వం రాయటానికి అవసరమైన మనస్థితినిస్తుంది .

శైలిని పరిశీలిస్తే ఈ కవితలను భాస్కర్ కష్టపడి కాకుండా ఇష్టపడి అలవోకగా రాశాడని అనిపిస్తుంది .

మొన్నటికి మొన్న ” నడిచే నక్షత్రాలు ” లో

” వారెవ్వా ప్రేమికులు
ఒకరి కంట మరొకరి కన్నీళ్లు ”

అన్నాడు . ప్రేమ లోని గాఢతను , విషాద ప్రేమ లోని దుఃఖాన్ని పాఠకులందరి కళ్ళల్లోంచి ఉబికి వచ్చేటట్లు చేశాడు భాస్కర్ .

నిన్నటికి నిన్న ” కిక్ ” కవితా సంపుటిలో

” అక్కడ కత్తులు లేవు
నెత్తురోడుతున్న మనసులు తప్ప ”

అంటూ రెండు పాదాలలో సమకాలీన కుటుంబ పర్వంలో పర్వం ( పండగ ) లేదని , కటువైన మాటలతో పరస్పరం గాయపరుచుకోవడమే ఉంటుందంటున్నాడు . అంతేనా ? ” నెత్తురోడుతున్న మనసులు ” అన్న వ్యక్తీకరణ ఉన్నత స్థాయిలో ఉండటం వలన కంటికి కనిపించని మనసు గాయపడ్డ దుస్థితిని పాఠకుల అనుభూతి ప్రపంచంలో దృశ్యమానం చేస్తున్నాడు .

రెండు యవనికలు తొలగిపోయిన తర్వాత వర్తమాన రంగస్థలం మీద ” సత్యాగ్రహం ” ఎట్లుందో మన చేతుల్లో ఉన్న ” ట్రూత్ ” ను అనుశీలిస్తే తెలుస్తుంది . చెట్టు విలువను అర్థం చేసుకోకుండా యాంత్రికంగా కొమ్మల కింద నిలబడితే లాభం ఏమిటి ? సత్యం విలువ తెలుసుకోకుండా యాంత్రికంగా జీవితంలో పాలుపంచుకుంటే లాభం లేదు .

కూడికలు – తీసివేతలు అనే కవితలో

” హృదయాలు అందమైన
ప్రేమ దారాలతో
కుట్టబడి
ఇంటికి తోరణాలుగా
శోభించాలి ”

అన్న జీవిత సత్యం తెలుసుకున్న భాస్కర్ , రెండు హృదయాలు ప్రేమ దారాలతో ఏకమైనప్పుడే మొత్తం కుటుంబం తేజోమయమవుతుందని అంటున్నాడు . కాని చాలా సంసారాలు అర్థసత్యాలతో , అసత్యాలతో చీకటి గుహలుగా , చీకటి మహల్లుగా మారిపోతున్నాయని ఆవేదన చెందుతున్నాడు కవి .

దేశ చరిత్రలో తెలంగాణ అవతరణ ఒక కఠిన సత్యం . తెలంగాణ యువ వీరులు ఉరులకు వేలాడితే చిలికింది తెలంగాణ . ఉద్యమాలు ఊపిరిగా పీలుస్తూ బతికింది తెలంగాణ . అయితే తెలంగాణను కలగన్న మహామహులు తెలంగాణను చూడకుండానే కను మూశారు .

” అమర వీరులు ” కవితలో

” ఈరోజు వచ్చిన తెలంగాణ
మీ ఆత్మార్పణల ఫలితమే
కానీ … అది చూసేందుకు
మీరు లేరు … మరిక రారు ”

కల నిజం కావడం కంటే గొప్ప సత్యం మరొకటి ఉండదు . ఈ సత్యానికి ఎంత శక్తి ఉందంటే అది అమరులకు కూడా ప్రాణం పోస్తుంది . ఆ ప్రాణం పాట రూపంలో కావచ్చు , కథ రూపంలో కావచ్చు , చరిత్ర రూపంలో కావచ్చు . మొత్తం మీద అమరులను బతికించుకోవడం మన సంస్కృతిలో ఒక భాగం .

తత్వ సంబంధమైన సత్యాసత్యాల విచారణ స్పష్టాస్పష్టంగా ఉంటుంది . అదొక తేనె తుట్ట . కాటు తినకుండా బయటపడం .

భాస్కర్ రాసిన ” ట్రూత్ ” కవిత చూడండి

” ఆకాశం అనే నిజం కింద
గాలి అనే అస్త్రాన్ని నింపుకొని
భూమి అనే నమ్మకం మీద నడుస్తున్నాము
గాలి తొలగిన నాడు
ఆత్మ ఆకాశంలోకి
శరీరం భూమిలోకి
అంతే జీవితం ”

ఇది కవి చేసిన ఏడు చరణాల విన్యాసం . ” ఖం , ఆకాశం , గగనం , శూన్యం ” అన్న పదాల పొందికను ఆధారంగా ఆకాశం అంటే ” ఏమీ లేదు ” అన్న వ్యాఖ్యానం చేసిన వారున్నారు . కనుక భాస్కర్ చెప్పే ” ఆకాశం అనే నిజం ” అన్నది సందేహాస్పదమవుతుంది . గాలి అనే అస్త్రం అస్పష్టంగా ఉంది . కాని ” భూమి అనే నమ్మకం మీద నడుస్తున్నాము ” అన్నది గొప్ప పాదం . పిపీలికాది మనుష్య పర్యంతం భూమినే నమ్ముకున్నారు . విశ్వాసం మనిషిని చీకట్లో నుంచి తీసుకువచ్చే వెలుతురు లాంటిది . ఇక ఆత్మ శరీరాల గురించి వేదాల దగ్గర నుండి వాదోపవాదాలున్నాయి . దేన్నో నమ్మటం కన్నా సుఖం లేదు .

స్థూల వస్తువుల మీద ఎవరైనా రాస్తారు . సూక్ష్మ వస్తువులను గూర్చిన కవిత్వ సృజన లోచూపు ఉన్నవాడికే సాధ్యం . ” ఛోటే ఛోటే బాతోంకి హై యాదే బడి ” అన్నాడొక హిందీ సినీ కవి .

” అద్భుతం ” కవిత చూడండి

” ఒకరిని ద్వేషించకపోవడం అద్భుతం
ఒకరిని మోసగించకపోవడం అద్భుతం
…….
చెప్పుకుంటూ పోతే
ఈ అద్భుతాలు చిన్నవే
పాటించడమే కష్టం ”

ఎదుటివాడిని వక్ర దృష్టితో కాక సానుకూల దృష్టితో చూడమంటున్నాడు కవి . ఇది ఒక అద్భుతంగా కవి కి కనిపించడం కొత్తగా ఉంది . మానవుడు పుట్టింది మొదలు అనేక Complex లకు గురవుతుంటాడని మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు అంటుంటారు . వాటిని జయించి , సంస్కారాన్ని అలవరుచుకుంటే సామాజిక జీవితంలో సమస్యలుండవు .

పశ్చాత్తాపం కూడా అట్లాంటి కవితే .

” నీ వాళ్ళ కోసం
నీ హృదయం చేసే అలికిడి
నీ మనస్సాక్షి చేసే వెక్కిరింతలు ”

పశ్చాత్తాప క్షణాలుగా చెప్తున్నాడు కవి .

” నీ ఆనందాన్ని పంచుకోవడానికి
నీ వాళ్ళే
నీకు లేనప్పుడు
నీ తప్పులు
నీకు గుర్తుకొస్తాయి ”

అని అంటున్నప్పుడు నీ వాళ్ళను నీవు దూరం చేసుకోవడం , ఆ తర్వాత పశ్చాత్తాప కారణమవుతుందన్న భావన ఉంది . ఇష్టం కూడా అట్లాంటి కవితే .

బతుక నేర్చిన తనాన్ని కవి ఇష్టపడడు . ఆ మాట కొస్తే ఏ కవీ ఇష్టపడడు . ముఖ్యంగా ఈ ప్రకృతి మనకెంతో ఇచ్చింది .

ప్రకృతి – వికృతి కవితలో కవి ఆలోచన బాగుంది .

” పక్షుల కిలకిలారావాలు
పారే సెలయేటి గలగలలు
వీచే చల్లటి గాలి సవ్వడులు
ఆకసాన అస్తమయ సంధ్యా వర్ణాలు
………
ఇవి కదా కావాలి ఎదగడానికి ”

ప్రకృతి అందచందాలను సౌందర్య దృష్టితో ఆస్వాదిస్తూ , దాన్ని మానవ సంబంధాలతో ప్రతిక్షేపించుకుంటూ కాలం గడపడం గొప్ప విషయమే . దీన్నే పైకి ఎదగడంగా భాస్కర్ భావిస్తున్నప్పుడు నాకు …

” Nature has been for me a source of solace , inspiration , adventure and delight , a home , a teacher , a companio ” అన్న Lorraine Anderson మాటలు గుర్తుకు వస్తున్నాయి . William Wordsworth అనే ఆంగ్ల మహాకవి వేల మైళ్ళు ప్రకృతిలో పాదయాత్రలు చేస్తూ ఆ యాత్రా దృశ్యాలను తన చెల్లెలికి వర్ణించి చెప్పే వాడట . ఆ కథనమే కవిత్వమై అతనిని గొప్ప ప్రకృతి కవిని చేసింది .

వ్యవసాయ రంగానికి సంబంధించిన అవగాహనతో

” అతని గుండె తడి కాకుండా
కొనసాగదు తరి ”

అని అంటున్నాడు భాస్కర్ . రైతు మీద రాయని కవి లేడు . గుండెకాయ గానో , వెన్నెముక గానో వర్ణించి జాలిపడటం ఒక పద్ధతి . విత్తనాలు చల్లిన తర్వాతి సమస్త దశలతో రైతు పెనవేసుకున్న అనుబంధాలను చిత్రించడం భాస్కర్ పద్ధతి . వాగాడంబరం లేని నిరాడంబరుడు , ఇటు భూమిని అటు ఆకాశాన్ని నమ్ముకున్న విశ్వాసి , తప్పు దేవునిదైనా తనను శిక్షించుకునే ఉదాత్తుడు . అందుకే

” రైతు చేసేది వ్యవసాయమా
లేక
చావు బతుకులతో సావాసమా ”

అని అంటున్నాడు కవి .

ఈ కవితా సంపుటిలో ప్రేమను గూర్చి , ఎడబాటును గూర్చి , తాను చదువుకున్న కాలేజీని గూర్చి , మానవ విలువలను గూర్చి ఇంకా ఇతర అంశాలను గూర్చి కవితలున్నాయి . వాటిలో అన్నీ కవిత్వంగా మారి ఉండకపోవచ్చు . కాని అవి భాస్కర్ వైవిధ్య సాధనకై చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తున్నాయి . ఇకముందు మరింత లోతూ , వైశాల్యమూ ఉన్న కవితలను భాస్కర్ నుంచి ఆశించవచ్చు .

— డా. అమ్మంగి వేణుగోపాల్
కాళోజీ నారాయణరావ్ తొలి పురస్కార గ్రహీత
94410 54637

ప్రతులకు –
మంచికట్ల భాస్కర్
ఇ. నం. 12-281/2B
కాకతీయ కాలనీ
హుజురాబాద్ – 505 468
సెల్ – 9440152991

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!